Showing posts with label Reviews. Show all posts
Showing posts with label Reviews. Show all posts

Friday, 18 November 2016

హీరో నిఖిల్" ఎక్కడికి పోతావు చిన్నవాడ" చిత్రం ఎంత వరకు అలరించిందో చూసేయండి !!


దర్శకత్వం : విని ఆనంద్
నిర్మాత : పి.వి. రావ్
సంగీతం : శేఖర్ చంద్ర
నటీనటులు : నిఖిల్, హెబ్బా పటేల్, నందిత శ్వేత
 థ్రిల్స్ తో పాటు ఎంటర్టైన్మెంట్ కూడా ఉన్న చిత్రం ఇది.
‘స్వామిరారా, కార్తికేయ, సూర్య వర్సెస్ సూర్య’ వంటి సినిమాలతో హ్యాట్రిక్ హిట్లందుకున్న హీరో నిఖిల్ మధ్యలో ‘శంకరాభరణం’ వంటి అపజయం ఎదురైనా మళ్ళీ తన ప్రయోగాల ఫార్ములానే పాటిస్తూ చేసిన చిత్రం ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’. ఫస్ట్ లుక్, ట్రైలర్లలతో మంచి హైప్ క్రియేట్ చేసుకున్న ఈ చిత్రం ఈరోజే ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి ఈ చిత్రం ఆ హైప్ ని అందుకుందా ? లేదా ? అనేది ఇప్పుడు చూద్దాం…
కథ :
అర్జున్ (నిఖిల్) అనే కుర్రాడు తన స్నేహితుడు (వెన్నెల కిశోర్) కు ట్రీట్మెంట్ చేయించడానికి కేరళకు వెళతాడు. అక్కడే అమల(హెబ్బా పటేల్) అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. కానీ హైదరాబాద్ తిరిగొచ్చాక తాను ప్రేమించింది ఒక ఆత్మనని తెలుకుని షాక్ అవుతాడు. అతను ఆ షాక్ లో ఉండగానే అమల ఆత్మ తనను ప్రేమించిన అర్జున్ ని వెతుక్కుంటూ వస్తుంది.
అలా అర్జున్ కి దగ్గరవాలనుకున్న ఆ అమల ఎవరు ? ఆత్మగా మారినా కూడా అర్జున్నే ఎందుకు ప్రేమించింది ? అర్జున్ కి దగ్గరవడానికి ఏం చేసింది ? చివరికి అర్జున్ అమలకి దక్కడా ? లేదా ? అసలు వాస్తవంగా అర్జున్ మనసులో ఎవరున్నారు ? అనేదే ఈ సినిమా కథ.
ప్లస్ పాయింట్స్ :
ప్లస్ పాయింట్స్ విషయానికొస్తే దర్శకుడు విఐ ఆనంద్ రొమాంటిక్ థ్రిల్లర్ ఆద్యంతం ఎంటర్టైన్మెంట్ ను జోడించి కథను చెప్పిన విధానం బాగుంది. ముఖ్యంగా సెకండాఫ్ లో కథనాన్ని నడిపిన తీరు ఆకట్టుకుంది. ఆద్యంతం కథలో ఎదో ఒక థ్రిల్ వస్తూ సినిమాపై ఆసక్తి పెరిగేలా చేసింది. ఫస్టాఫ్, సెకండాఫ్ లలో నడిచే కొత్తదనమున్న కామెడీ ఆకట్టుకుంది. వెన్నెల కిశోర్, సత్యలు టైమింగ్ ఉన్న పంచ్ లతో మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు.
అలాగే ఫస్టాఫ్ ఓపెనింగ్ ఆసక్తికరంగా ఉంది. ఇంటర్వెల్ థ్రిల్ అయితే సెకండాఫ్ లో ఏం జరుగుతుందో అనే ఆసక్తిని పెంచింది. ఇక సినిమాకి మరో పెద్ద ప్లస్ పాయింట్ సెకండాఫ్ లో వచ్చే అమల పాత్రను పోషించిన నటి నందితా శ్వేతా నటన. పీకల్లోతు ప్రేమలో మునిగిపోయిన ఒక ఆత్మగా ఆమె నటన అద్భుతమనే చెప్పాలి. కీలక సన్నివేశాల్లో ఆమె హావభావాలు, బాడీ లాంగ్వేజ్ అన్నీ సినిమాకి ప్లస్ అయ్యాయి. ఆమెపై నడిచే సన్నివేశాలు ప్రతిదీ ఆకట్టుకుంది. క్లైమాక్స్ రొటీనే అయినప్పటికీ అందులో నటనతో దానికి కాస్త కొత్తదనాన్ని తీసుకొచ్చింది నందితా శ్వేత. హీరో నిఖిల్, హెబ్బా పటేల్ ల నటన కూడా ఆకట్టుకుంది.
మైనస్ పాయింట్స్ :
మైనస్ పాయింట్స్ లో ముందుగా చెప్పుకోవలసింది ఫస్టాఫ్ ఓపెనింగ్, ఇంటర్వెల్ మధ్యలో ఉన్న రన్ టైమ్ గురించి. ఆ రన్ టైమ్ లో నడిచే సినిమా చాలా వరకూ బోరింగానే సాగింది. అక్కడక్కడా వచ్చే వెన్నెల కిశోర్ కామెడీని మినహాయిస్తే ఇంటర్వెల్ పడే వరకూ ఎక్కడా రిలీజ్ దొరకలేదు. దర్శకుడు ఆ పార్ట్ ని ఇంకాస్త గ్రిప్పింగా రాసుకుని ఉండాల్సింది. అలాగే సెకండాఫ్ కథనంలో కూడా కాస్త బలం లోపించింది. ముఖ్యంగా క్లైమాక్స్ సీక్వెన్స్ రొటీన్ గానే ఉంది. సెకండాఫ్ నడుస్తున్న కొద్దీ ఆహా.. క్లైమాక్స్ అద్దిరిపోయేలా ఉంటుంది అనుకుంటే అది అన్ని సినిమాల్లాగే పాతగానే సాగింది.
సాంకేతిక విభాగం :
సాంకేతిక విభాగానికొస్తే పేపర్ మీదే కన్ఫ్యూజన్ కలిగించే ఈ కథను తెర మీద చాలా వరకూ స్పష్టంగా ఆవిష్కరించిన దర్శకుడు, రచయిత విఐ ఆనంద్ గురించి చెప్పుకొవాలి. సినిమా ఓపెనింగ్, ఇంటర్వెల్ థ్రిల్, సెకండాఫ్ కథనం, కామెడీని టైమింగ్ లో వాడుకున్న తీరు బాగున్నాయి. వీటికి తోడు రన్ టైమ్ తగ్గించి, కథనంలో బలాన్నిపెంచి ఉంటే బాగుండేది. అలాగే శేఖర్ చంద్ర అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకి చాలా ఉపయోగపడింది. కీలకమైన సన్నివేశాల్లోని తీవ్రతను రెట్టింపు చేసింది. సాయి శ్రీరామ్ కెమెరా పనితనం చాలా బాగుంది. చోటా కె ప్రసాద్ ఎడిటింగ్ బాగుంది. ఇక నిర్మాత పి.వి రావ్ పాటించిన నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి.
తీర్పు :
నిఖిల్ మరోసారి తన ప్రయోగాత్మకమైన ఫార్ములాను నమ్ముకునిచేసిన మరో ప్రయత్నమే ఈ ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ చిత్రం. రొమాంటిక్ థ్రిల్లర్ జానర్లో వచ్చిన ఈ చిత్రంలో ఫస్టాఫ్ ఓపెనింగ్, ఇంటర్వెల్ సీక్వెన్స్, సెకండాఫ్ కథనం, వెన్నెల కిశోర్, సత్యల కామెడీ, నందిత శ్వేతా నటన ప్లస్ పాయింట్స్ కాగా ఫస్టాఫ్ లో బోర్ కొట్టించే కథనం, ఎక్కువైన రన్ టైమ్, సెకండాఫ్ లో కథనంపై కాస్తంత పట్టు లోపించడం, రొటీన్ క్లైమాక్స్ లు మైనస్ పాయింట్స్. మొత్తంగా చెప్పాలంటే ఈ చిత్రం థ్రిల్స్ తో పాటు మంచి ఎంటర్టైన్మెంట్స్ కు కూడా పంచి ఈ వారాంతంలో ధైర్యంగా చూడదగ్గ సినిమాగా నిలబడింది.

ఓవరాల్ సినిమా రివ్యూ రేటింగ్:3.25/5


Friday, 4 November 2016

పిల్ల రాక్షసి సినిమా – బాగా ఇబ్బంది పెట్టింది !!

దర్శకత్వం : మిథున్ మాన్యూల్ థామ‌స్
నిర్మాత : చదలవాడ పద్మావతి
సంగీతం : షాన్ రహమాన్
నటీనటులు : సారా అర్జున్‌, స‌న్ని వాయ్‌నే
‘బిచ్చగాడు’ సినిమాని తెలుగు ప్రేక్షకులకు సమర్పించి అనూహ్యమైన గొప్ప విజయాన్నందుకున్న చదలవాడ పద్మావతి ఈసారి కూడా తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకంతో మలయాళంలో సూపర్ హిట్టైన `ఆన్ మ‌రియ క‌లిప్పిలాను` చిత్రాన్ని ‘పిల్ల రాక్షసి’ పేరుతో తెలుగు ప్రేక్షకులకు సమర్పిస్తున్నారు. మరి ఈ చిత్రం ఏ మేరకు ఆకట్టుకుందో ఇప్పుడు చూద్దాం...
కథ :
అనన్య(సారా అర్జున్) అనే 4 వ తరగతి అమ్మాయికి ఆటలంటే చాలా ఇష్టం. ముఖ్యంగా వాళ్ళ నాన్నకు ఇష్టమైన లాంగ్ జంప్ అంటే ఆ పాపకు మరీ ఇష్టం. స్కూల్ లో జరిగే లాంగ్ జంప్ పోటీల్లో గోల్డ్ మెడల్ గెలవాలని లక్ష్యంగా పెట్టుకుని ప్రాక్టీస్ చేస్తుంటుంది. కానీ సెలక్షన్స్ లో ఆ స్కూల్ పి.డి అనన్యను కావాలనే డిస్క్వాలిఫై చేస్తాడు.
దాంతో నొచ్చుకున్న అనన్య ఆ పి. డి మీద కోపం తీర్చుకోవడానికి ఒక కిరాయి రౌడీ గిరీష్ ( స‌న్ని వాయ్‌నే) ని పి. డి ని కొట్టమని చెప్పి పురమాయిస్తుంది. అసలు పి.డి అనన్యను ఎందుకు డిస్క్వాలిఫై చేస్తాడు ? అతనికి అనన్యకు మధ్య గొడవేమిటి ? అనన్య మాట్లాడిన రౌడీ గిరీష్ పి.డి ని ఏం చేశాడు ? ఈ ప్రాసెస్ లో గిరీష్, అనన్య ల జర్నీ ఎలా సాగింది ? అన్నదే ఈ చిత్రం.
ప్లస్ పాయింట్స్ :
సినిమాలో ప్లస్ పాయింట్స్ విషయానికొస్తే ముందుగా చెప్పుకోవలసింది అనన్యగా నటించిన బేబీ సారా అర్జున్ గురించి. సినిమా మొత్తం మీద సారా నటనే పెద్ద హైలెట్. ప్రతి సన్నివేశంలోనూ చాలా సహజంగా నటించి ఆకట్టుకుంది సారా. కొన్ని ఎమోషనల్ సన్నివేశాల్లో అయితే అద్భుతమైన నటన కనబరిచింది. అలాగే సారాకు, ఆమె తల్లిదండ్రులకు మధ్య నడిచే ఫ్యామిలీ ట్రాక్ ను దర్శకుడు,రచయిత మిథున్ మాన్యూల్ థామ‌స్ బాగానే రాసుకున్నారు.
అలాగే పిల్లలతో, వాటి భావోద్వేగాలతో కథ నడపాలన్న దర్శకుడి ప్రాధమిక ఉద్దేశ్యం ఇంప్రెసివ్ గా ఉంది. ఇక సినిమా చివర్లో యంగ్ హీరో దుల్కర్ సల్మాన్ అతిధి పాత్ర అప్పటి ఉన్న బోరింగ్ ఫీల్ ను కాస్త పోగొట్టడంలో ఉపయోగపడింది. అలాగే సినిమా రన్ టైమ్ కూడా తక్కువ కావడం ప్రేక్షకుడికి కాస్త కలిసొచ్చే అంశం. సినిమాకి విష్ణు శర్మ అందించిన సినిమాటోగ్రఫి ఆకట్టుకునేలా ఉంది.
మైనస్ పాయింట్స్ :
మైన్స్ పాయింట్స్ లో ముందుగా చెప్పుకోవలసింది దర్శకుడు, రచయిత అయిన మిథున్ మాన్యూల్ థామ‌స్ గురించి. కేవలం పిల్లల భావోద్వేగాలను ఆధారంగా చేసుకుని ఎమోషనల్ డ్రామా నడపాలన్న ఆయన ఉద్దేశ్యం మంచిదే అయినప్పటికీ ఆయన ప్రయత్నం మాత్రం పూర్తిగా బెడిసికొట్టేసింది. ఏదో ఒక ఎమోషన్ ను మాత్రమే తీసుకుని దాన్నే పూర్తి స్థాయిలో చూపాల్సింది పోయి ఒక చిన్న పాపలోని సెంటిమెంట్, భయం, మంచితనం, చిలిపి కోపం, అమాయకత్వం, తెలివి తేటలు వంటి అన్ని అంశాలను తీసుకుని ఏ ఒక్కదాన్ని కూడా బలంగా చూపలేకపోయాడు దర్శకుడు.
సినిమా మొదలైన దగ్గర నుండి కథనం బోరింగ్ గా సాగుతూ పోయిందే తప్ప ఎక్కడా కూడా కాస్తలో కాస్తైనా మెరుగుపడ్డ దాఖలాలు కనిపించలేదు. ముఖ్యంగా హీరో పాత్రలో ఏమాత్రం ఏమోషన్ లేదు. పాపతో అతని బంధం బలపడుతున్న కొద్దీ అతనిలో ఆ భావోద్వేగాలు బయటపడి ప్రేక్షకుడిని కదిలించాలి. కానీ అలా జరగలేదు. కనీసం అలాంటి బలమైన సన్నివేశాలను కూడా క్రియేట్ చేయలేదు దర్శకుడు. సినిమా మొత్తంలో పాప ఫ్యామిలీ ట్రాక్ తప్ప మిగతా అంతా బోరింగ్ గానే ఉంది. పైగా సినిమాలో హీరో ఫ్రెండ్ తో కామెడీ పండించే ప్రయత్నం చేసినప్పటికీ అది కొంచెం కూడా వర్కవుట్ కాలేదు.
సాంకేతిక విభాగం :
సాంకేతిక విభాగానికొస్తే రచయిత, దర్శకుడు అయిన మిథున్ మాన్యూల్ థామ‌స్ ప్రేక్షకులను ఆకట్టుకునే కథా కథనాలు రాసుకోవడంలో విఫలమయ్యారు. ఒక్క పాప ఫ్యామిలీ ట్రాక్ తప్ప మిగతా అంతా వృధా ప్రయత్నమే అయింది. ఇక షాన్ రహమాన్ అందించిన సంగీతం అక్కడక్కడా పరవాలేదనిపించింది. లిజో పాల్ ఎడిటింగ్ బాగానే ఉంది. విష్ణు శర్మ సినిమాటోగ్రఫీ సినిమాకు బాగా ఉపయోగపడింది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగానే ఉన్నాయి.
తీర్పు :
ఒక నాలుగవ తరగతి పాప తన పి.డి తనను ఇబ్బంది పెట్టిన కారణంగా కోపం తెచ్చుకుని అతనికి బుద్ది చెప్పాలని చేసే ప్రయత్నంలో ఒక కిరాయి రౌడీకి ఫ్రెండ్ అవుతుంది. ఇక అక్కడి నుండి ఆ రౌడీతో పాప జర్నీ ఎలా సాగింది, చివరికి ఏమైంది అన్నదే ఈ సినిమా కథ. ఇందులో పాపగా నటించిన సారా అర్జున్ నటన, కొన్ని ఫ్యామిలీ ఎమోషనల్ సన్నివేశాలు ప్లస్ పాయింట్స్ కాగా క్లారిటీ, బలం లేని కథ, ఆధ్యంతం బోరింగ్ గా సాగే కథనం, ఎక్కడా టచ్ చేయలేని చాలా పేలవమైన ఎమోషన్స్ ఇందులో మైనస్ పాయింట్స్. మొత్తగా చెప్పాలంటే ‘బిచ్చగాడు’ సినిమాని డబ్ చేసిన నిర్మాతలే దీన్ని కూడా డబ్ చేశారని.. కాబట్టి ఇందులో ఏదో విషయం ఉండే ఉంటుందని థియేటర్ కు వెళితే మాత్రం దెబ్బైపోవడం ఖాయం.
ఓవరాల్ సినిమా రివ్యూ రేటింగ్ :1.75/5

Friday, 28 October 2016

హీరో కార్తి "కాష్మోరా" సినిమా ఆల్ టైం బ్లాక్ బస్టర్ హిట్ ఆ లేక టైమ్ పాస్ హర్రర్ కామెడీనా ??



దర్శకత్వం : గోకుల్
నిర్మాత : ఎస్ ఆర్ ప్రకాష్ బాబు
సంగీతం : సంతోష్ నారాయణన్
నటీనటులు : కార్తి, నయనతార, శ్రీదివ్య
‘ఆవారా, ఊపిరి’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన తమిళ స్టార్ హీరో కార్తి నటించిన చిత్రం ‘కాష్మోరా’. హర్రర్, కామెడీ, మాస్ ఎంటర్టైనర్ జానర్ లో తెరకెక్కిన ఈ చిత్రం మొదటి నుండి పోస్టర్లతో, టీజర్లతో, ట్రైలర్లతో ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని క్రియేట్ చేసింది. ఇన్ని అంచనాల మధ్య ఈరోజే విడుదలైన ఈ చిత్రం ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..
కథ :
కాష్మోరా (కార్తి) అనే వ్యక్తి దెయ్యాల పట్ల ప్రజల్లో ఉన్న భయాన్ని ఆసరాగా చేసుకుని దెయ్యాలను వదిలిస్తానంటూ వాళ్ళను మోసం చేస్తూ డబ్బు, పేరు సంపాదిస్తూ ఉంటాడు. అలా ఒకరోజు ఒక వ్యక్తి తన కోటలో ఉన్న దెయ్యాల్ని బయటికి పంపమని, ఎంత డబ్బు కావాలన్నా ఇస్తానని అంటాడు. దాంతో కాష్మోరా ఆ కోటలోకి వెళ్లి తన కుటుంబంతో సహా ఇరుక్కుపోతాడు.
అలా అందులో ఇరుక్కుపోయిన కాష్మోరాను అక్కడికి రప్పించింది ఎవరు ? అందులో ఎవరున్నారు ? వాళ్ళకి కాష్మోరాతో ఏ అవసరం ఉంది ? వాళ్ళు కాష్మోరాను ఎలాంటి ఇబ్బందులు పెట్టారు ? కాష్మోరా వాళ్ళ నుండి తప్పించుకుని ఎలా బయటపడ్డాడు ? అనేదే ఈ సినిమా కథ.
ప్లస్ పాయింట్స్ :
సినిమాలో ప్లస్ పాయింట్స్ విషయానికొస్తే ముందుగా చెప్పుకోవలసింది ఫస్టాఫ్ ఓపెనింగ్ మరియు ప్రీ ఇంటర్వెల్ సీక్వెన్స్ గురించి. దర్శకుడు, రచయిత అయిన గోకుల్ ఈ రెండు సందర్భాలనీ బాగా రాసుకుని అంతకన్నా బాగా తెరపై ఆవిష్కరించాడు. ముఖ్యంగా ప్రీ ఇంటర్వెల్ సీక్వెన్స్ లో పండిన కామెడీ అయితే చాలా బాగా ఎంటర్టైన్ చేసింది. సెకండాఫ్ లో వచ్చే ఫాంటసీ ఫ్లాష్ బ్యాక్ లో రాజ్ నాయక్ (కార్తి) పాత్ర విజువల్ గా బాగుంది, అలాగే అందులో వచ్చే విజువల్ ఎఫెక్ట్స్ బాగున్నాయి.
ఇక సినిమాకి అతి పెద్ద ప్లస్ పాయింట్ కార్తి నటన. కథలోని మూడు పాత్రల్లో కార్తి చాలా బాగా నటించాడు. ముఖ్యంగా కాష్మోరా క్యారెక్టర్లో అతను చేసిన కామెడీ మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చింది. రాజ్ నాయక్ పాత్రలో అతని భిన్నమైన నటన మెప్పించింది.
మైనస్ పాయింట్స్ :
మైనస్ పాయింట్స్ లో ప్రధానమైనది సెకండాఫ్ లో వచ్చే ఫాంటసీ ఫ్లాష్ బ్యాక్. ఇందులో పెద్దగా బలమైన కథాంశం లేకపోవడం, రన్ టైమ్ ఎక్కువవడం బోర్ కొట్టించాయి. సెకండాఫ్ ముందుకు వెళుతున్న కొద్ది నిరుత్సాహం తప్ప సినిమాపై పెద్దగా ఆసక్తి కలగలేదు. అలాగే రాజ్ నాయక్ గా కార్తి నటన, స్క్రీన్ ప్రెజెన్స్ బాగున్నప్పటికీ ఆ పాత్ర చిత్రీకరణ అంత ప్రభావంతంగా లేదు.
అలాగే ఫస్టాఫ్, సెకండాఫ్ లలో ఒకే ఉద్ద్యేశ్యంతో ఉన్న సీన్లు పదే పదే రిపీట్ అవ్వడం బోర్ కొట్టించింది. ఇక మధ్యలో వచ్చే పాటలు కూడా నీరసంగా ఉన్నాయి. ఇక సెకండాఫ్ క్లైమాక్స్ ఎపిసోడ్ కొత్తగా, ఆసక్తికరంగా ఏమీ లేదు. హర్రర్ కామెడీ మాస్ జానర్ గా వచ్చిన ఈ సినిమాలో కామెడీ, మాస్ ఎలిమెంట్స్ అయితే బాగానే కనబడ్డాయి కానీ హర్రర్ మాత్రం పూర్తిగా మిస్సయింది.
సాంకేతిక విభాగం :
ఇక సాంకేతిక విభాగంలో దర్శకుడు గోకుల్ హీరో కార్తిలోని నటుడిని చాలా బాగా వాడుకున్నాడు. హీరో పాత్రలోనే కామెడీ చేయించి మంచి ఎనర్టైన్మెంట్ క్రియేట్ చేయడంలో సక్సెస్ అయ్యాడు. సంతోష్ నారాయణన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. సెకండాఫ్ ఫాంటసీ ఎపిసోడ్ లో విజువల్ ఎఫెక్ట్స్ టీమ్ అందించిన ఎఫెక్ట్స్ బాగున్నాయి. ఓం ప్రకాష్ సినిమాటోగ్రఫీ బాగుంది. సాబు జోసెఫ్ ఎడిటింగ్ కథను కన్ఫ్యూజన్ లేకుండా క్లియర్ గా ఉండేలా సహాయపడింది. రాజ్ నాయక్ పాత్ర డిజైన్ ఆర్ట్ డిపార్ట్మెంట్ ప్రతిభ స్పష్టంగా కనబడింది. ఎస్ ఆర్ ప్రకాష్ బాబు నిర్మాణ విలువలు బాగున్నాయి.
తీర్పు :
ఈ కాష్మోరా చిత్రం రోటీన్ జానర్లో సాగే సినిమాలకు భిన్నంగా హర్రర్ కామెడీ మాస్ ఎంటర్టైన్మెంట్ జానర్లో ఉండే సినిమా. ఇందులో ఫస్టాఫ్ ఓపెనింగ్, ప్రీ ఇంటర్వెల్ సీక్వెన్స్, సెంకడాఫ్ ఫాంటసీ ఫ్లాష్ బ్యాక్ లో సాగే కొన్ని సన్నివేశాలు, హీరో కార్తి నటన ప్రధాన ప్లస్ పాయింట్స్ కాగా సెకండాఫ్ లో ఎక్కువైన రన్ టైమ్, సెకండాఫ్ ఫాంటసీ ఫ్లాష్ బ్యాక్ లో నడిచే కథ బలంగా లేకపోవడం, పడే పడే రిపీట్ అయ్యే సన్నివేశాలు, మధ్యలో వచ్చే పాటలు, హర్రర్ పూర్తిగా మిస్సవడం ఇందులోని మైనస్ పాయింట్స్. మొత్తం మీద ఈ కాష్మోరా ఈ దీపావళికి అన్ని వర్గాల ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసే చిత్రం.

ఓవర్ఆల్ సినిమా రివ్యూ రేటింగ్ : 3.75/5


Friday, 21 October 2016

"నందిని నర్సింగ్ హోమ్" సినిమా జెన్యూన్ రివ్యూ !!

దర్శకత్వం : పి.వి.గిరి
నిర్మాత : రాధాకిషోర్ జి, భిక్షమయ్య సంగం
సంగీతం : అచ్చు
నటీనటులు : నవీన్ విజయ్ కృష్ణ, శ్రావ్య, నిత్యా నరేష్.
సీనియర్ నటుడు నరేష్ తనయుడు నవీన్ విజయ్ కృష్ణ హీరోగా పరిచయం అవుతూ చేసిన సినిమా ‘నందిని నర్సింగ్ హోమ్. నవీన్‌కు బంధువైన సూపర్ స్టార్ మహేష్ ఈ సినిమా ఆడియోను ఆవిష్కరించడంతో అప్పట్నుంచే మంచి ఆసక్తి రేకెత్తించిన ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి ఈ నందిని నర్సింగ్ హోమ్‌ ఎంతవరకు ఆకట్టుకుందీ? చూద్దాం..

కథ :

చంద్రశేఖర్ అలియాజ్ చందు (నవీన్ విజయ్ కృష్ణ)కు డబ్బంటే ఎంతో ఇష్టం. బాగా డబ్బు సంపాదించాలన్న ఆలోచనతో హైద్రాబాద్ వచ్చిన అతడికి, అనుకోకుండా సిటీలోనే పెద్ద హాస్పిటల్స్‌లో ఒకటైన నందిని నర్సింగ్ హోమ్‌లో డాక్టర్‌గా ఉద్యోగం వస్తుంది. డాక్టర్ అవ్వడానికి తనవద్ద ఏ అర్హతా లేకున్నా, దొంగ డాక్టర్‌గా ఆ ఉద్యోగంలో చేరతాడు. నందిని నర్సింగ్ హోమ్‌లో చందు చేరకముందు నుంచే కొన్ని భయానక సంఘటనలు జరుగుతుంటాయి. చందు అక్కడ చేరాక ఈ సంఘటనలు మరింత పెరిగిపోతాయి. దీంతో నందిని నర్సింగ్ హోమ్ పేరు కూడా పడిపోతుంది. ఈ సంఘటనలు అన్నింటికీ కారణం ఎవరు? నందిని నర్సింగ్ హోమ్‍ను దెబ్బతీయాలని ఎవరు చూస్తూంటారు? దీన్ని చందు ఎలా కనిపెడతాడు? ఈ కథలో నందిని (నిత్యా నరేష్), అమూల్య (శ్రావ్య) ఎవరు? అన్న ప్రశ్నలకు సమాధానమే సినిమా.

ప్లస్ పాయింట్స్ :

ఈ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ అంటే ఒక సస్పెన్స్ ఎలిమెంట్‌ను మొదట్నుంచీ, చివరివరకూ ఎంతో ఆసక్తిగా నడిపించిన విధానాన్ని చెప్పుకోవాలి. రెగ్యులర్ కమర్షియల్ కామెడీగా కనిపించే కథలో మొదటి సీన్‌తోనే ఒక సస్పెన్స్ ఎలిమెంట్‌ను మొదలుపెట్టడం, క్లైమాక్స్ వరకూ అది ఏమై ఉంటుందా అని ఆలోచించేలా చేయడం బాగా ఆకట్టుకుంది. ఇక ఆ సస్పెన్స్ ఎలిమెంట్ కూడా ఊహించే విధంగా ఉండకపోవడం మరో బలం. ఈ సస్పెన్స్ ఎలిమెంట్ రివీల్ అయ్యే ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ సన్నివేశాలు కట్టిపడేసేలా ఉన్నాయి. వైజాగ్ నేపథ్యంలో నడిచే నవీన్ – శ్రావ్యల ప్రేమకథ కూడా బాగుంది. వెన్నెల కిషోర్, సప్తగిరి, షకలక శంకర్‌ల కామెడీ సినిమా ఆద్యంతం సాగుతూ బాగా నవ్వించాయి. ఈ ముగ్గురూ తమ కామెడీతో సినిమాకు ఓ మంచి స్థాయి తెచ్చారు.
నవీన్ విజయ్ కృష్ణకు ఇది మొదటి సినిమా అయినా ఎక్కడా తడబడకుండా బాగా చేశాడు. అతడి స్క్రీన్ ప్రెజెన్స్, యాక్టింగ్ అన్నీ ఒక డెబ్యూట్ హీరో స్థాయికి మించి ఉండడంతో ఎక్కడా కొత్త హీరోను చూస్తున్న ఫీలింగ్ కనిపించలేదు. నిత్యా నరేష్ క్యూట్‌గా ఉంది. ఉన్నంతలో తన పాత్రలో ఆమె బాగా నటించింది. శ్రావ్య లుక్స్ బాగున్నాయి. జయప్రకాష్ తన స్థాయికి తగ్గ పాత్రలో బాగా నటించాడు.

మైనస్ పాయింట్స్ :

ఈ సినిమాకు మేజర్ మైనస్ పాయింట్ అంటే లెంగ్త్ కాస్త ఎక్కువవ్వడం అనే చెప్పుకోవాలి. కొన్ని అనవసరమైన సన్నివేశాలకు చోటిస్తూ పోవడం వల్ల అక్కడక్కడా సినిమా చాలా నెమ్మదిగా నడిచినట్లనిపించింది. ఇక కామెడీ పంచడంలో ఎక్కడా తగ్గకపోయినా, వెన్నెల కిషోర్, సప్తగిరి ట్రాక్ కాస్త ఎక్కువసేపు సాగినట్లనిపించింది. సెకండాఫ్‌లో అసందర్భంగా వచ్చే ఓ పాటను కూడా మైనస్‌గానే చెప్పుకోవాలి.
అదేవిధంగా తాను దొంగ డాక్టర్ అవ్వడం వల్ల, తన చేతుల్లో ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయాక కూడా హీరో చాలా సాదాసీదాగా నవ్వుతూ తిరగడం చూస్తే కథ ఎమోషన్‌ను దెబ్బతీసినట్లే అనిపించింది. ఇక లాజిక్ అన్న దాన్ని చాలాచోట్ల పట్టించుకోలేదనే చెప్పాలి.

సాంకేతిక విభాగం :

ముందుగా దర్శకుడు పివి గిరి విషయానికి వస్తే, ఒక పక్కా కమర్షియల్ తెలుగు సినిమా ఫార్మాట్‌లోనే మంచి సస్పెన్స్ థ్రిల్లర్‌ను పట్టుకొని దానిచుట్టూనే తెలివిగా ఓ కథ చెప్పడంలో మంచి విజయం సాధించాడు. సస్పెన్స్ ఎలిమెంట్‌ను చివరివరకూ ఆసక్తికరంగా నడిపించేలా చేయడంలో దర్శకుడి ప్రతిభను గమనించవచ్చు. అనవసరమైన పాటలకు, సన్నివేశాలకు చోటివ్వకుండా, కాస్త లెంగ్త్ తగ్గించి ఉంటే సినిమా మరో స్థాయిలో ఉండేదనిపించింది. సస్పెన్స్ ఎలిమెంట్ చుట్టూ సినిమా నడిచేటప్పుడల్లా మేకింగ్ పరంగా చేసిన ప్రయోగాలు బాగున్నాయి.
సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. నర్సింగ్ హోమ్‌లోనే ఎక్కువగా నడిచే సినిమాలో, ఉన్న లొకేషన్స్‌నే తెలివిగా వాడిన విధానం మెచ్చుకోవచ్చు. ఎడిటింగ్ ఫర్వాలేదనలే ఉంది. పాటలు రెండు వినడానికి బాగున్నాయి. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది. ఆర్ట్ డైరెక్టర్ పనితనాన్ని అభినందించాల్సిందే. ప్రొడక్షన్ వ్యాల్యూస్ ఒక మిడిల్ బడ్జెట్ సినిమా స్థాయిలో ఎక్కడా తగ్గకుండా బాగున్నాయి.

తీర్పు :

ఒక రెగ్యులర్ కమర్షియల్ కామెడీలో ఏ ప్రేక్షకుడైనా కొన్ని అంశాలను కోరుకొని వెళుతుంటారు. ఈ సినిమానూ అలాగే ఊహించుకొని వెళితే, బాగా నవ్వించే ఈ కమర్షియల్ కామెడీతో పాటు అదిరిపోయేలా ఓ సస్పెన్స్ ఎలిమెంట్ కూడా ఉండడం సర్‌ప్రైజ్. ఆద్యంతం ఆ సస్పెన్స్ ఎలిమెంట్‌ను చాలా తెలివిగా దాచిపెడుతూ క్లైమాక్స్‌లో బయటపెట్టడం, ఈ మధ్యలో ఎక్కడా బోర్ కొట్టకుండా వచ్చే మంచి కామెడీ లాంటి ప్లస్‌లతో వచ్చిన ఈ సినిమాలో అనవసరమైన సన్నివేశాలు కొన్ని సినిమాను నెమ్మదించడం, లెంగ్త్ కాస్త ఎక్కువవ్వడం అన్నది మైనస్. ఒక్క మాటలో చెప్పాలంటే.. కామెడీతో జిల్‌మనిపిస్తూనే, సస్పెన్స్‌తో థ్రిల్ చేసే సినిమా ‘నందిని నర్సింగ్ హోమ్’!

ఓవర్ ఆల్ మూవీ రేటింగ్ :3.75/5


నారా రోహిత్ "శంకర" సినిమా కొత్తగావుందో లేక పాతబడి పోయిందో చూద్దాం !!

దర్శకత్వం : తాతినేని సత్య ప్రకాష్
నిర్మాత : ఆర్.వీ.చంద్రమౌళి ప్రసాద్
సంగీతం : సాయి కార్తీక్
నటీనటులు : నారా రోహిత్, రెజీనా..
’జ్యో అచ్యుతానంద’ సినిమాతో ఎప్పట్నుంచో ఎదురుచూస్తోన్న మంచి హిట్ కొట్టేసిన నారా రోహిత్, ఎప్పట్నుంచో విడుదలకు నోచుకోకుండా ఉన్న ‘శంకర’ అనే సినిమాతో నేడు ప్రేక్షకుల ముందుకొచ్చారు. రోహిత్ సరసన రెజీనా హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..

కథ :

శంకర్ (నారా రోహిత్) ఒక సాధారణ మధ్య తరగతి యువకుడు. తన అన్నయ్య చిన్నా(చిన్నా) పంపించే డబ్బులతో హాస్టల్‌లో ఉంటూ చదువుకునే శంకర్‌కు, సమాజంలో జరిగే అవినీతిపై పోరాడాలని ఉంటుంది. అలాంటి ఆలోచనలున్న శంకర్, కొన్ని అనుకోని పరిస్థితుల్లో ఓ ఏసీపీ (జాన్ విజయ్)కి సంబంధించిన అవినీతి వ్యవహారంలో చిక్కుకుంటాడు. ఈ గొడవలోనే చావు దాకా వెళ్ళొచ్చిన శంకర్‌కు ఆ తర్వాత సమాజంలో పిచ్చోడు, డ్రగ్స్‌కు బానిస అనే ముద్ర పడిపోయేలా ఏసీపీ కారణమవుతాడు. అసలు శంకర్ ఏ అవినీతి వ్యవహారంలో చిక్కుకొని ఇబ్బందుల పాలయ్యాడు? దాన్నుంచి బయటపడేందుకు ఏమేం చేశాడు? తనపై పడ్డ డ్రగ్స్‌కు బానిసనే ముద్రను ఎలా పోగొట్టుకున్నాడు? ఈ కథలో అనన్య (రెజీనా) ఎవరు? అన్న ప్రశ్నలకు సమాధానమే సినిమా.

ప్లస్ పాయింట్స్ :

ఈ సినిమాకు ఉన్నంతలో పెద్ద ప్లస్ పాయింట్ అంటే మూలకథ అని చెప్పాలి. ఒక సాధారణ యువకుడు తనకు తెలీకుండానే పెద్ద అవినీతికి సంబంధించిన వ్యవహారంలో ఇరుక్కోవడం, ప్రాణాలు పోయేదాకా తెచ్చుకోవడం, తిరిగి పోరాడడం.. ఇలా ఒక పూర్తి స్థాయి సినిమాకు సరిపడా ఎమోషన్ ఉందీ కథలో! అసలు కథలోకి ఎంట్రీ ఇస్తూ వచ్చే ఇంటర్వెల్ బ్యాంగ్‌ను సినిమాకు హైలైట్‌గా చెప్పుకోవాలి. ప్రీ క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్ కూడా ఆకట్టుకునేలా ఉంది.
నారా రోహిత్ మరోసారి తన స్థాయికి తగ్గ నటనని ప్రదర్శించాడు. ఇటు కుర్రాడిగా సాదాసీదాగా కనిపిస్తూనే, అవసరమైనప్పుడల్లా యాంగ్రీ మ్యాన్‌గా మారిపోయి బాగా ఆకట్టుకున్నాడు. రెజీనా పూర్తి స్థాయి డీ గ్లామర్ రోల్‌లో బాగానే చేసింది. విలన్‌గా జాన్ విజయ్ మంచి ప్రతిభనే కనబరిచాడు.

మైనస్ పాయింట్స్ :

అసలు కథలో బలమైన ఎమోషన్ ఉండడాన్ని అటుంచితే, దానికి తగ్గట్టుగా అదే స్థాయి స్క్రీన్‌ప్లే కానీ, కట్టిపడేసే సన్నివేశాలు కానీ లేకపోవడమే ఈ సినిమాకు మేజర్ మైనస్. ఎంతో మంచి యాక్షన్ థ్రిల్లర్ కాగల కథను నీరసంగా, ఒక్కో సన్నివేశం సంబంధం లేకుండా వచ్చేలా డిజైన్ చేసి విసుగు తెప్పించారు. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్యాంగ్ మొదలయ్యే వరకూ సినిమాలో ఎప్పుడు ఏ సీన్ వస్తుందో తెలియనట్టుగా స్క్రీన్‌ప్లే ఉంది. హీరో ఇంట్రడక్షనే ఒక అర్థం లేని పాటతో మొదలుపెట్టడం అస్సలు బాలేదు.
విడుదలకు చాలాకాలం నోచుకోని ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ అన్నీ తేలిపోవడంతో ఏదో 90ల్లోని సినిమాను థియేటర్లలో చూసిన ఫీలింగ్ కనిపించింది. నారా రోహిత్ లుక్ కూడా సినిమా మొత్తం ఒకేలా లేకపోవడం కంటిన్యూటి దెబ్బతీసేలా తయారైంది.

సాంకేతిక విభాగం :

ముందుగా దర్శకుడు తాతినేని సత్య ప్రకాష్ గురించి మాట్లాడుకుంటే, ఒక సినిమాకు సరిపడా మంచి కథనే ఎంచుకున్న ఆయన, దాన్ని సినిమాగా మలచడంలో మాత్రం విఫలమయ్యాడు. ఎంతో ఇంటెన్సిటీతో సాగాల్సిన సినిమాను, సన్నివేశాలను, నిస్సారంగా నడిపి చాలాచోట్ల సాదాసీదా ప్రతిభ కూడా చూపలేకపోయాడు. ఓపెనింగ్ సీన్‌ను ఇంటర్వెల్ బ్యాంగ్‌కు కలిపిన విధానంలో మాత్రం దర్శకుడి పనితనం చూడొచ్చు. అంతకుమించి దర్శకుడిగా సత్య ప్రకాష్ చేసిందేమీ లేదు.
సినిమాటోగ్రఫీ ఫర్వాలేదనేలా ఉంది. ఎడిటింగ్ ఏమాత్రం ఆకట్టుకునేలా లేదు. అనవసరమైన ట్రాన్సిషన్స్ సినిమా మూడ్‌నే దెబ్బతీసేలా తయారయ్యాయి. సంగీతం చెప్పుకోదగ్గ స్థాయిలో లేదు. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, రీ రికార్డింగ్ కూడా అంతంతమాత్రమే. ప్రొడక్షన్ వ్యాల్యూస్ గురించి చెప్పుకోవడానికి ఏమీ లేదు.

తీర్పు :

ఒక మంచి కథతో అన్నిసార్లూ మంచి సినిమాలే చేయలేమని ఇప్పటికే ఎన్నో సినిమాలు ఋజువు చేసి చూపాయి. ‘శంకర’ ఒక మంచి కథతో వచ్చిన బాలేదనిపించే సినిమా. నారా రోహిత్ హానెన్స్ట్ పర్ఫామెన్స్, కథలో ఉన్న ఎమోషన్, ఇంటర్వెల్ బ్యాంగ్, ప్రీ క్లైమాక్స్‌లో వచ్చే ఛేజ్, ఇలా అక్కడక్కడా ఫర్వాలేదనిపించే అంశాలను కొన్ని నింపుకున్న ఈ సినిమాలో మిగతావేవీ గుర్తింపుకు కూడా నోచుకోలేని స్థాయిలో ఉండడమే అతిపెద్ద మైనస్. ఒక్క మాటలో చెప్పాలంటే.. శంకర, థియేటర్ల ముందుకు రావడం లేట్ అవ్వడం అటుంచితే, వచ్చి చేసేది కూడా ఏం ఉండదన్నది రిలీజ్ తర్వాతే తెలుసుకునే విషయం!

ఓవర్ఆల్ రివ్యూ రేటింగ్:2.75/5


Thursday, 20 October 2016

"ఎల్ 7 " సినిమా రివ్యూ- రొటీన్ కధే కానీ....!!


దర్శకత్వం : ముకుంద్ పాండే
నిర్మాత : ఓబుల్ సుబ్బారెడ్డి
సంగీతం : అరవింద్ శంకర్
నటీనటులు : అదిత్ అరుణ్, పూజా జవేరి..

హర్రర్ థ్రిల్లర్ జానర్‌కు తెలుగులో ఈ మధ్య కాలంలో బాగా క్రేజ్ పెరిగిన నేపథ్యంలో, అదే జానర్‌ను నమ్ముకొని వచ్చిన సినిమాయే ఎల్ 7. అదిత్, పూజా జవేరీలు హీరో, హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి ఈ హర్రర్ థ్రిల్లర్ ఎంతవరకు బయపెట్టిందో చూసేద్దాం .

కథ :

అరుణ్ (అదిత్ అరుణ్), సంధ్య (పూజా జవేరి) కొత్తగా పెళ్ళైన జంట. ఎంతో ఇష్టంగా ఊరి చివర్లో ఓ పెద్ద ఇంటిని అద్దెకు తీసుకొని అందులో ఉండాలనుకొని వచ్చిన వారికి అక్కడ కొన్ని అనుకోని పరిస్థితులు ఎదురవుతాయి. ఆ ఇంట్లోకి వచ్చిన తర్వాతే సంధ్య వింతగా ప్రవర్తించడం మొదలుపెడుతుంది. ఒక ఎక్స్‌పరిమెంట్ ద్వారా ఆ ఇంట్లో దయ్యం ఉందని తెలుసుకున్న అరుణ్, ఆ తర్వాత ఏం చేశాడు? ఆ దయ్యం తన భార్యలోకే ఎందుకు ప్రవేశించింది? ఆ దయ్యం కథేంటీ? ఆ ఇంట్లో నుంచి ఈ జంట ఎలా బయటపడింది? అన్నదే సినిమా.

ప్లస్ పాయింట్స్ :

ఈ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ అంటే దయ్యం ఫ్లాష్‌బ్యాక్ అనే చెప్పుకోవాలి. అన్ని హర్రర్ సినిమాల్లోలానే ఈ సినిమాకూ ఎంచుకున్న కథ పాతదే అయినా, ఫ్లాష్‌బ్యాక్ మాత్రం ఉన్నంతలో కొత్తగా ఉంది. ఇక ప్రీ ఇంటర్వెల్‌కు ముందు ఇంట్లో దయ్యం ఉందా? లేదా? అంటూ చేసే ఓ ఎక్స్‌పరిమెంట్ చాలా బాగుంది. ఆ సమయంలో వచ్చే థ్రిల్స్‌తో పాటు, ఆ సన్నివేశాల మేకింగ్ కూడా ఆకట్టుకునేలా ఉన్నాయి. ఇక ఇంటర్వెల్ తర్వాత వచ్చే వెన్నెల కిషోర్ కామెడీ బాగా నవ్వించింది. వెన్నెల కిషోర్ తన టైమింగ్‌తో మామూలు సన్నివేశాలను కూడా కడుపుబ్బా నవ్వించేలా చేయగలనని ఈ సినిమాతో మరోసారి నిరూపించుకున్నాడు.
అదిత్ అరుణ్ ఓ సింపుల్ రోల్‌లో బాగా నటించాడు. క్లైమాక్స్‌లో లేడీ గెటప్ వేసుకొని కూడా మెప్పించాడు. ఇక పూజా జవేరి ఓ బలమైన రోల్‌లో బాగా నటించింది. ముఖ్యంగా ఫస్టాఫ్ అంతా గ్లామర్‌తో ఆకట్టుకున్న ఆమె, సెకండాఫ్‌లో దయ్యంగా బాగా మెప్పించింది. కథను మొదలుపెట్టిన సన్నివేశాన్ని, క్లైమాక్స్‌కు తెలివిగా కలిపిన విధానం బాగా ఆకట్టుకుంది.

మైనస్ పాయింట్స్ :

కథ చాలా పాతది కావడమే ఇక్కడ మైనస్ పాయింట్‌గా చెప్పుకోవచ్చు. ఒక్క ఫ్లాష్‌బ్యాక్ ఏమై ఉండొచ్చని ఆలోచించడం తప్పితే మిగతా అంతా మనం ఊహించినట్లుగానే జరుగుతూ పోతుంది. దీంతో సినిమా కథనం అం అసక్తిగా సాగలేదు. సెకండాఫ్‌లో హీరోయిన్ దయ్యంగా మారాక ఆమెకు వేసిన మేకప్ కూడా భయపెట్టేదిగా లేకపోవడం అటుంచితే, చూడడానికి కూడా అస్సలు బాగోలేదు. ఇక ఫస్టాఫ్‌లో ఇంటర్వెల్ బ్లాక్ వచ్చేవరకూ కథ మొదలుకాకపోవడం నిరుత్సాహపరచే అంశమే! దయ్యం అంశాన్ని పక్కనబెడితే కొన్ని విషయాల్లొ లాజిక్ లేకపోవడం మైనస్ అనే చెప్పాలి. ఇక ఫస్టాఫ్‌లో వచ్చే రెండు పాటలూ అనవసరమైనవిగానే కనిపించాయి.

సాంకేతిక విభాగం :

సాంకేతిక అంశాల పరంగా చూస్తే, దర్శక, రచయిత ముకుంద్ పాండే ఒక రొటీన్ కథనే మళ్ళీ, మనకు తెలిసినే హర్రర్ థ్రిల్లర్ ఫార్మాట్‌లోనే చెప్పే ప్రయత్నం చేశాడు. ఫ్లాష్‌బ్యాక్‌‍కు ఎంచుకున్న పాయింట్ విషయంలో మాత్రం దర్శకుడు కొత్తదనం చూపించాడు. అది పక్కనబెడితే ఓ సాదాసీదా హర్రర్ థ్రిల్లర్‍ని మాత్రమే అందించగలిగాడు. మేకింగ్ విషయంలో కొన్ని చోట్ల దర్శకుడు చేసిన ప్రయోగాలు బాగున్నాయి.
సినిమాటోగ్రఫీ కథ అవసరానికి తగ్గట్టు బాగుంది. పాటలు అసందర్భమైనవే కాక, వినడానికి కూడా బాగోలేదు. బ్యాక్‍గ్రౌండ్ స్కోర్ ఫర్వాలేదు. ఎడిటింగ్ ఫర్వాలేదు. ప్రొడక్షన్ వ్యాల్యూస్ ఉన్నంతో బాగున్నాయి.

తీర్పు :

కొత్తగా పెళ్ళైన ఒక జంట పెద్ద ఇంట్లోకి అద్దెకు దిగుతుంది. ఆ ఇంట్లో ఉండే ఓ దయ్యం వారిని ఇబ్బందులకు గురి చేస్తుంది. ఆ ఇబ్బందులను దాటి బయటపడడానికి వారు ఎన్నో కష్టాలు పడాలి. ఇదే కథతో ఒక్క తెలుగులోనే కాక, ఎన్ని భాషల్లో ఎన్ని హర్రర్ సినిమాలు వచ్చాయో మన అందరికి తెలుసు! ఎల్ 7 కూడా సరిగ్గా ఇదే కథతో ఎన్నోసార్లు చూసినట్లనిపించే ఓ హర్రర్ థ్రిల్లర్. అయినప్పటికీ పెద్దగా బోర్ కొట్టించకపోవడం, మంచి ఇంటర్వెల్, ఫ్లాష్‍బ్యాక్ ఎపిసోడ్, వెన్నెల కిషోర్ కామెడీ లాంటి ప్లస్ పాయింట్స్ కొన్ని ఉన్నాయీ సినిమాలో! ఒక్క మాటలో చెప్పాలంటే.. చూసిన సినిమానే మళ్ళీ చూసినా ఫర్వాలేదనుకొని, కొన్ని థ్రిల్స్ కోసం చూస్తే ‘ఎల్ 7’ ఫర్వాలేదనిపిస్తుంది.

ఓవర్ ఆల్ రేటింగ్: 3.0/5

హీరో కళ్యాణ్ రామ్ "ఇజం" సినిమా జెన్యూన్ రివ్యూ హిట్టా లేక ఫట్టా ?? మీరే చూడండి !!


దర్శకత్వం : పూరి జగన్నాథ్
నిర్మాత : కళ్యాణ్ రామ్
సంగీతం : అనూప్ రూబెన్స్
నటీనటులు : కళ్యాణ్ రామ్, అధితి ఆర్య

డాషింగ్ డైరెక్షర్ పూరి జగన్నాథ్ డైరెక్షన్లో నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా చేసిన చిత్రం ‘ఇజం’. ఫస్ట్ లుక్స్, టీజర్ బాగుండటం, కళ్యాణ్ రామ్ పాత లుక్ ను మార్చి కొత్తగా కనిపిస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు చాలా పెరిగాయి. ఈ చిత్రంలో సోషల్ మెసేజ్ ఉండటంతో ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెరిగింది. ఇన్ని అంచనాల మధ్య ఈరోజే ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం ఆ అంచనాలను ఏ మేరకు అందుకుందో ఇప్పుడు చూద్దాం…

కథ :

సత్య మార్తాండ్ (కళ్యాణ్ రామ్) అనే భాద్యత గల జర్నలిస్ట్ చిన్నతనంలో తన కుటుంబానికి జరిగిన ఓ అన్యాయం కారణంగా ప్రాభావితుడై ప్రస్తుతం దేశంలో జరుగుతున్న అన్యాయాలను, దోపిడీని, పేదలు, రైతుల కష్టాలను చూసి తట్టుకోలేక, వాటికి కారణమైన రాజకీయనాయకులు, దోపిడీదారులు దాచుకున్న బ్లాక్ మనీని ఇండియాకి తెచ్చి పేదలకు పంచాలని నిర్ణయించుకుంటాడు. అందుకోసం ఇండియా మోస్ట్ వాంటెడ్ మాఫియా డాన్ అయిన జావెద్ భాయ్ (జగపతి బాబు) ను టార్గెట్ చేసుకుంటాడు.
అలా కళ్యాణ్ రామ్ జగపతి బాబుకు ఎలా దగ్గరయ్యాడు ? అతని ద్వారా విదేశాల్లో అక్రమార్కుల దాచుకున్న నల్ల డబ్బుని ఎలా కొల్లగొట్టాడు ? దాన్ని పేద ప్రజలకు ఎలా పంచాడు ? అసలు ఇదంతా చేయడానికి అతన్ని ప్రభావితం చేసిన అతని చిన్నతనపు సంఘటన ఏమిటి అనేదే ఈ సినిమా కథ.

ప్లస్ పాయింట్స్ :

సినిమాలోని ప్లస్ పాయింట్స్ విషయంలో ముందుగా చెప్పుకోవలసింది కళ్యాణ్ రామ్ స్క్రీన్ ప్రెజన్స్, అతని పెర్ఫార్మెన్స్ గురించి. కళ్యాణ్ రామ్ తన ముందు సినిమాల్లో కన్నా ఇందులో చాలా కాన్ఫిడెంట్ గా నటించాడు. అతని డైలాగ్ డెలివరీ, మ్యానరిజం, ఎమోషనల్ సన్నివేశంలో చూపించిన హావభావాలు చాలా బాగున్నాయి. కళ్యాణ్ రామ్ ను పూర్తిగా మార్చేసి కొత్తగా చూపిస్తూ పూరి ఇచ్చిన ఫ్రెష్ నెస్ చాలా బాగుంది. సినిమా ఫస్ట్ హాఫ్ అంతా కళ్యాణ్ రామ్ క్యారెక్టర్ ఎలివేషన్, పెర్ఫార్మెన్స్ తో బాగానే సాగిపోయింది.
ఇక సెకండాఫ్ ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్ అయితే సినిమా మొత్తానికీ హైలెట్ గా నిలిచింది. ఆ సన్నివేశంలో పూరి రాసిన సోషల్ డైలాగులు, కళ్యాణ్ రామ్ పెర్ఫార్మెన్స్ ఎమోషన్ ను బాగా పండించాయి. అలాగే ఫస్టాఫ్ లో జగపతి బాబుకి, కళ్యాణ్ రామ్ కి మధ్య బీడీ స్నేహం, హీరోయిన్ అధితి ఆర్యకు, కళ్యాణ్ రామ్ కు మధ్య లవ్ సీన్స్ కొన్ని బాగున్నాయి. పాటలు కూడా సందర్భానుసారంగా వస్తూ మంచి ఫీల్ ని ఇచ్చాయి. ముఖ్యంగా పూరి పాడిన పాట బాగుంది.

మైనస్ పాయింట్స్ :

సినిమాలోని మైన్స్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే ముందుగా చెప్పుకోవలసింది సెకండాఫ్ గురించి. ఇందులో ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్ మినహా మిగతా అన్ని సన్నివేశాలు ఊహాజనితంగానే ఉండి బోర్ కొట్టించాయి. అలాగే జావెద్ భాయ్ గా విలన్ జగపతిబాబుని మొదట్లో ఓ రేంజ్ లో చూపించి ఆ తరువాత పూర్తిగా తేల్చేశాడు. ఇక క్లైమాక్స్ లో అయితే ఇండియాలో జరుగుతున్న కరెప్షన్ కి అండగా నిలిచిన జగపతిబాబుని ఏమాత్రం నొప్పించకుండా ఫ్రీగా వదిలేయడం హీరో లక్ష్యాన్నే దెబ్బ తీసేదిగా ఉండి నిరుత్సాహపరిచింది.
అలాగే హీరోయిన్ అధితి ఆర్య తో ఇంకాస్త పెర్ఫార్మెన్స్ చేయించి ఉంటే బాగుండేది. ఫస్ట్ హాఫ్ తో పోలిస్తే సెకండాఫ్ ను హడావుడిగా ముగించేశారు. హీరో నల్ల ధనాన్ని ఇండియాకు తిరిగి తెప్పించడానికి, దోపిడీదారులను బయటకు లాగడానికి చేసిన ప్రయత్నాన్ని రఫ్ గా చూపించేసి వదిలేశారు. దాన్ని ఇంకాస్త వివరంగా చూపించి ఉంటే బాగుండేది.

సాంకేతిక విభాగం :

దర్శకుడు పూరి ఎప్పటిలాగే కళ్యాణ్ రామ్ నుండి పూర్తి స్థాయి నటనను రాబట్టుకోవడంలో, అతన్ని కొత్తగా చూపించడంలో పూర్తిగా సక్సెస్ అయ్యాడు. అలాగే రచయితగా ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్ ఆయన రాసిన డైలాగులు, బ్లాక్ మనీని వెనక్కి తెప్పించి ప్రజలకు పంచిన తీరు రియలిస్టిక్ గా ఉన్నాయి. ఫస్టాఫ్ లో హీరో పాత్ర చుట్టూ రాసుకున్న కొన్ని సన్నివేశాలు కొత్తగా ఉన్నాయి. కానీ సెకండాఫ్ చివర్లో జగపతి బాబు పాత్రకి ఇచ్చిన జడ్జిమెంట్ ఆమోదయోగ్యంగా లేదు. పాటలకు అనూపు రూబెన్స్ ఇచ్చిన సంగీతం బాగుంది. ముఖేష్ జి సినిమాటోగ్రఫీ బాగుంది. జునైద్ ఎడిటింగ్ బాగుంది. నిర్మాణ సంస్థ ఎన్టీఆర్ ఆర్ట్స్ పాటించిన నిర్మాణ విలువలు సినిమా స్థాయిని పెంచేవిగా ఉన్నాయి.

తీర్పు :

‘ఇజం’ చిత్రం నటుడిగా కళ్యాణ్ రామ్ స్థాయిని పెంచేదిగా ఉంది. ఇందులో బోర్ కొట్టకుండా సాగిపోయే ఫస్టాఫ్, కళ్యాణ్ రామ్ స్క్రీన్ ప్రెజన్స్, పెర్ఫార్మెన్స్, ఎమోషనల్ గా ఉండే ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్, పాత సోషల్ సబ్జెక్టు కు పూరి ఇచ్చిన కొత్త, ఆమోదయోగ్యమైన ముగింపు సినిమాలో ప్లస్ పాయింట్స్ కాగా, ఊహాజనితమైన, బోరింగ్ సెకండాఫ్ కథనం, జగపతి బాబు పాత్రకి సరైన జడ్జిమెంట్ ఇవ్వకపోవడం, హడావిడిగా క్లైమాక్స్ ను చుట్టేయడం ఇందులో మైనస్ పాయింట్స్. మొత్తంగా చెప్పాలంటే సోషల్ మెసేజ్ ఉన్న కమర్షియల్ సినిమాలని ఇష్టపడే ప్రేక్షకులకు ఈ ‘ఇజం’ చిత్రం ఖచ్చితంగా బాగుంటుంది మరియు నచ్చుతుంది.

ఓవర్ఆల్ రివ్యూ రేటింగ్: 3.25/5


Thursday, 13 October 2016

నాగాభరణం స్టోరీ రివ్యూ మిరే చుడండి

                                               
                                             
                                                       

                                                     డైరెక్టర్: కోడి రామకృష్ణ
                                నిర్మాత: సాజిద్ ఖురేషి, సోహైల్ అన్సారీ.ధవళ్ గదా
                                                       స్టోరీ: కోడి రామకృష్ణ
                                                   మాటలు: ఎంఎస్ రమేష్ స్టార్
                                 తారాగణం: విష్ణువర్ధన్, రమ్య, రాజేష్ వివేక్.దిగంత
                                                        సంగీతం: గురుకిరణ్
                                                       ఛాయాగ్రహణం: వేణు
                                                       ఎడిటర్: జానీ హర్ష
                                నిర్మాణసంస్థ: ఇన్బాక్స్ పిక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్, బ్లాక్బస్టర్ స్టూడియోస్,
                                                   విడుదల తేదీ: 14 అక్టోబర్ 2016
                                                          బడ్జెట్: 40 కోట్లు
కోడి రామకృష్ణ ఈ  చిత్ర నిర్మాత.అతను దక్షిణ భారత సినీ పరిశ్రమలో సీనియర్ దర్శకుల లో ఒకరు .అతను అనేక చలన చిత్రాలు తీశారు  మరియు అనేక బహుమతులనకూడా  గెలుచుకున్నారు .అయన  అమ్మోరు  వంటి సినిమాలు వంటి భగవంతుడి  చేశారూ , అరుంధతి బాక్స్ ఆఫీసు వద్ద బ్లాక్బస్టర్ ఉంది.ఈ సినిమాలు అతనికి భారీ ప్రశంసలు పొందారు మరియు కూడా విస్తృత ప్రశంసలు.ఈ చలన చిత్రాన్ని ప్రధాన పాత్రలో" అనుష్క శెట్టి" కలిగి ఈ చిత్రం కూడా ఇతర ప్రధాన పాత్రల్లో శివాజీ  షిండే, సోనూ సూద్ కలిగి ఉండగా.నాగాభరణం సినిమా వస్తున్నట్లు, ఇది స్పష్టంగా ఉంటుంది దర్శకుడు హార్డ్ పని చేశారు ఈ నాగాభరణం ట్రైలర్ లోనే కనిపిస్తుంది.ఆయనకు చిత్ర పరిశ్రమలోచాల   అనుభవం వుంది , నాగాభరణం  మూవీ రివ్యూ మరియు రేటింగ్ అంచనాలు ఉన్నాయి.

  నాగాభరణం  మూవీ స్టోరీ రివ్యూ 

నాగాభరణం చిత్రం యొక్క కథాంశం వస్తున్నట్లు, ఈ చిత్రం ఆమెకు నగరంలో ఒక బాగా తెలిసిన వ్యక్తి అయిన నాగానిక  (రమ్య) అనే గతాన్ని పాత్ర ప్రారంభమవుతుంది. ఆమె మరియు ఆమె పూర్వీకులు సంవత్సరాల 100 నుండి ఒక పాత మైలురాయి పొదుపు చేశారు.కృత్రిమ తాంత్రికుడు కపాలి (రాజేష్ వివేక్ ఉపాదాయ ) మరియు అతని పూర్వీకులు ఈ లార్డ్ శివ మాన్యుమెంట్ స్వాధీనపరచు అనేక సంవత్సరాల నుండి నాగానిక కుటుంబంతో పోరాడుతూ చేశారు.ఈసారి కపాలి నాగానిక చంపి మాన్యుమెంట్ ఆక్రమించింది.ఆమె జీవితం కోల్పోకుండా అయితే ఆమె కపాలి ద్వారా ప్రతీకారం తీసుకోవాలని తిరిగి అని హామీ ఇస్తాడు.క్రింది పుట్టిన, నాగానిక మానస, ఒక పాము మహిళ గా పుట్టిన పడుతుంది మరియు కపాలి మీద ఆమె ప్రతీకారం తీర్చుకుంటాడు.ఈ చిత్రంలోని అనేక దృశ్యాలకు గూస్బంప్స్ కావచ్చు.మొత్తంమీద, ఫ్లిక్ గొప్ప సాంకేతిక విలువలు మరియు విజువల్స్ తో అద్భుతంగా ఉంది.
చిత్రం అంతా శివుని స్మారక రక్షిస్తుంది ఆ పాము దృష్టి పెడుతుంది.పౌరాణిక సినిమాలు ఆసు డైరెక్టర్గా ఎవరు కోడి రామకృష్ణ వంటి విషయాలపై పట్టు అద్భుతంగా కథ నిర్వహన చేశారు.చిత్రంలో శివ యొక్క స్మారక రక్షించుకోడానికే అని 120 అడుగుల పాము ఉంటుంది.శివుని యొక్క స్మారక ఉత్కంఠభరిత అందంగా ఉంది.
మేకర్స్ చిత్రం లో వ్యాధి సూపర్స్టార్ విష్ణువర్ధన్ పునఃసృష్టి ముఖ్యంగా గ్రాఫిక్స్ మీద సుమారు 15 కోట్ల పంపారు.
అతను ఒక అతిధి పాత్రలో కనిపించనున్నారు మరియు అతని అభిమానులు అక్షరాలా చిన్న పాత్రలో తన ఉనికిని ప్రేమ ఉంటుంది.నటి రమ్య తన రాజకీయ ఆరంగేట్రం తరువాత  నాగాభరణంఆమె పునఃప్రవేశ చేసింది.

నాగాభరణం సినిమా పబ్లిక్ చర్చ  ఆడియన్స్ రెస్పాన్స్:

సినిమా విడుదలైన అన్ని ప్రేక్షకుల నుండి సానుకూల చర్చ కలిగియున్నది.సినిమా చాలా ఆశ్చర్యకరమైన అంశాలు పట్టు అదృష్టముగా దృష్టిని రెడీ పొందుపర్చారు.చిత్రం లో గ్రాఫిక్స్ గుర్తింపు పొందాయి.
నేపథ్య సంగీతం చిత్రానికి సముచితంగా సరిపోయే.వ్యాధి విష్ణువర్ధన్ చేయడానికి వాడిన డిజిటల్ వినోద గ్రాఫిక్స్ పెద్ద తెరపై కనిపిస్తాయి విలువైన క్లాప్ ఉన్నాయి. 

ప్లస్ పాయింట్స్: 

స్టోరీ 
దర్శకత్వం 
గ్రాఫిక్స్ 
నాగాభరణం మూవీ రేటింగ్: 3.25 / 5



Friday, 7 October 2016

సునీల్"ఈడు గోల్డ్ ఏహే" చిత్రం విడుదల అయింది ఈ చిత్రం ఎంత వరకు అలరించిందో చూద్దాం..

గత కొన్నాళ్లుగా చాలా నీరసంగా సాగిన హీరో సునీల్ కెరీర్ జూలై నెలాఖరున విడుదలైన ‘జక్కన’ చిత్రం కమర్షియల్ గా మంచి విజయం సాదించడంతో గాడిలో పడింది. దీంతో ప్రస్తుతం ఆయన తన మిత్రుడు వీరు పోట్ల డైరెక్షన్లో ‘ఈడు గోల్డ్ ఏహే’ చిత్రంలో నటించాడు. అలాగే మొదటిసారి ఓవర్సీస్ లో విడుదలవుతున్న సునీల్ సినిమా కూడా ఇదే.ఈ చిత్రం తాలూకు ట్రైలర్స్, ఆడియో బాగుండటంతో సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి.ఈ చిత్రం దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.మరి చిత్రం ఎంత వరుకు అలరించిందో చూద్దాం..

దర్శకత్వం : వీరూ పోట్ల
నిర్మాత : రామ బ్రహ్మం సుంకర
సంగీతం : సాగర్ మహతి
నటీనటులు : సునీల్, సుష్మా రాజ్, రిచా పనాయ్...
కథ :
బంగార్రాజు (సునీల్) ఎవ్వరూ లేని ఓ అనాథ. నచ్చిన చోటల్లా పనిచేసుకుంటూ వెళ్ళే బంగార్రాజు ఎక్కడ పనిచేస్తే అక్కడ అతడి యజమానికి ఇబ్బందులు తలెత్తుతాయి. అలాంటి బంగార్రాజును తన పెద్ద కొడుకుగా జయసుధ చేరదీస్తుంది. జయసుధ కుటుంబంతో పాటే ఉండే బంగార్రాజు, ఆ ఇంటికి సంబంధించిన వ్యాపారమే చూస్తూంటాడు. కాగా ఇదే సమయంలో మహదేవ్ అనే ఇంటర్నేషనల్ బెట్టింగ్ క్రిమినల్ మనుషులతో పాటు చాలా మంది బంగార్రాజు వెంటపడుతుంటారు.
బంగార్రాజును సునీల్ వర్మలా భావిస్తూ అందరూ వెంటపడుతుంటారు. ఓ సమయంలో అన్నీ కోల్పోయిన పరిస్థితుల్లో సునీల్ వర్మను వెతుక్కుంటూ బంగార్రాజు ప్రయాణం మొదలుపెడతాడు. ఆ తర్వాత ఏమైంది? సునీల్ వర్మ ఎవరు? ఈ కథలో గీత (సుష్మా రాజ్), రిచా పనాయ్ ఎవరు? మహదేవ్‍కి, సునీల్ వర్మకి ఉన్న సంబంధం ఏంటి? ఈ ఇబ్బందులన్నింటి నుంచీ బంగార్రాజు ఎలా బయటపడ్డాడన్నదే సినిమా.
ప్లస్ పాయింట్స్ :
ఈడు గోల్డ్ ఎహేకి ప్రధాన బలమంటే ట్విస్ట్‌లనే చెప్పాలి. సినిమా ఫ్లోలో ఇంటర్వెల్‌ అప్పుడు, ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్‌లలో వచ్చే ట్విస్ట్‌లు అదిరిపోయాయి. ముఖ్యంగా క్లైమాక్స్ ట్విస్ట్ షాక్ ఇచ్చేలా ఉంది. ఇవన్నీ ఒక క్యారెక్టర్ చుట్టూ తిరిగే కథలో బాగా సెట్ అవ్వడం కూడా ప్లస్ పాయింట్‌గానే చెప్పాలి. ఇక కథ రీత్యా పుట్టిన కామెడీ కొన్నిచోట్ల నవ్వించింది. షకలక శంకర్ దొంగగా చేసే కామెడీ, ప్రీ క్లైమాక్స్‌లో వచ్చే పృథ్వీ అడల్ట్ కామెడీ, వెన్నెల కిషోర్ టీసీగా చేసే కామెడీ ఇలా ట్రాక్స్‌గా వచ్చే ఈ ఎపిసోడ్స్ అన్నీ బాగానే ఆకట్టుకున్నాయి.
హీరో సునీల్ ఎప్పట్లానే తన ఎనర్జీతో నటించేశాడు. కామెడీ పంచ్‌లు కూడా బాగానే పేలుస్తూ సునీల్ తన స్థాయికి తగ్గట్టు నటించాడు. హీరోయిన్లు సుష్మా రాజ్, రిచా పనాయ్ నటన పరంగా ఫర్వాలేదనిపించినా, అందాల ప్రదర్శనతో బాగా మెప్పించారు. ఇక జయసుధ, అరవింద్, పృథ్వీ, నరేష్ తమ తమ పాత్రలకు న్యాయం చేసి మెప్పించారు.
మైనస్ పాయింట్స్ :
మూడు, నాలుగు బలమైన ట్విస్ట్‌ల చుట్టూ అల్లిన కథను పక్కనబెడితే, కట్టిపడేసే స్థాయిలో స్క్రీన్‌ప్లే లేకపోవడమే ఈ సినిమాకు ప్రతికూలాంశం. ఆ ట్విస్ట్‌లు వచ్చే సందర్భాలు వాటికి ముందు సన్నివేశాలు మినహాయిస్తే మిగతా సినిమా అంతా బోరింగ్‌గానే నడిచింది. ఆ బోరింగ్ సన్నివేశాలను కూడా జాగ్రత్తగా రాసుకొని స్క్రీన్‌ప్లే రెడీ చేసి ఉంటే ఈడు గోల్డ్ ఎహే స్థాయి వేరేలా ఉండేది. అలా లేకపోవడం వల్లే పడుతూ, లేస్తూ, పడుతూ లేస్తూ నడిచింది. సునీల్ హీరోగా మారినప్పట్నుంచీ ఆయన పాత్రలు చూస్తే, అన్నీ ఒకే తరహాలో సాగుతూంటాయి. ఈసారికి ఆ తరహా పాత్ర పూర్తిగా బోర్ కొట్టినట్లే అనిపించింది.
ఫస్టాఫ్‌లో అసలు కథ మొదలవ్వడానికి చాలా సమయం తీసుకోవడాన్ని కూడా మైనస్‌గానే చెప్పాలి. ఇక హీరో-హీరోయిన్ల లవ్ ట్రాక్ కూడా ఆకట్టుకునేలా లేదు. పోసాని కృష్ణ మురళితో పాటు ఇతరత్రా కొన్ని సెపరెట్ కామెడీ ట్రాక్స్ కావాలని ఇరికించినట్లు అనిపించింది. విలన్ పాత్ర కూడా పెద్దగా ఆకట్టుకునేలా లేదు.

సాంకేతిక విభాగం :
ముందుగా దర్శకుడు వీరూ పోట్ల విషయానికి వస్తే, ఒక కామెడీ థ్రిల్లర్‌కు సరిపడా మంచి కథను, ట్విస్ట్‌లను పెట్టుకొని వాటితో చేయాల్సిన మ్యాజిక్ చేయలేకపోయాడనే చెప్పాలి. ఆయన రాసిన స్క్రీన్‌ప్లే పకడ్బందీగా లేదు. అయినప్పటికీ ట్విస్ట్‌లన్నీ సినిమాగా బాగానే ఆకట్టుకుంటాయి. కొన్నిచోట్ల వీరూ పోట్ల మార్క్ కామెడీ కూడా బాగానే ఆకట్టుకుంది. స్క్రీన్‌ప్లే విషయంలో జాగ్రత్తలు తీసుకొని ఉంటే సినిమా వేరే స్థాయిలో ఉండేది.
సాగర్ మహతి అందించిన పాటల్లో చెప్పుకోదగ్గ పాటలేవీ లేవు. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం బాగా ఆకట్టుకుంది. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ బాగోలేదు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రొడక్షన్ వ్యాల్యూస్ బాగున్నాయి.
తీర్పు :
‘ఈడు గోల్డ్ ఎహే’.. చెప్పుకోవడానికి మంచి కథ ఉండి, అదిరిపోయే ట్విస్ట్‌లు ఉన్నా కూడా వాటన్నింటినీ కలిపే బలమైన స్క్రీన్‌ప్లే లేకుండా వచ్చిన కమర్షియల్ సినిమా. పైన చెప్పిన ట్విస్ట్‌లు, ఇంటర్వెల్ బ్యాంగ్, క్లైమాక్స్ ఎపిసోడ్, కథతో సంబంధం లేకున్నా వచ్చే కామెడీ ట్రాక్స్ లాంటి మంచి కమర్షియల్ అంశాలతో వచ్చిన ఈ సినిమాలో మిగతా చోట్ల ఆ స్థాయిలో ఆకట్టుకోవడానికి ఏమీ లేకపోవడమే పెద్ద మైనస్. ఒక్క మాటలో చెప్పాలంటే.. టైమ్‌పాస్ చేసేలా ఉంది, ట్విస్ట్‌లు బాగున్నాయి, అయితే ‘ఈ సినిమా గోల్డ్ ఎహే’ అనే స్థాయిలో అయితే లేదు.

ఓవరాల్ రేటింగ్:3.4/5


నాగ చైతన్య " ప్రేమమ్" చిత్రం జెన్యూన్ రివ్యూ మీ కోసం...

నాగ చైతన్య అక్కినేని, శ్రుతిహాసన్, మడొన్నాసెబాస్టియన్, అనుపమ పరమేశ్వరన్ ల కాంబినేషన్ లో, చందు మొండేటి దర్శకత్వంలో యువ నిర్మాత సూర్యదేవర నాగవంశీ 'సితార ఎంటర్ టైన్మెంట్స్' పతాకంపై పి.డి.వి ప్రసాద్ సమర్పణలో తెరకెక్కిన 'ప్రేమమ్' చిత్రం ఈ రోజు గ్రాండ్ గా రిలీజైంది.మలయాళ హిట్ మూవీకి రీమేక్ కావడం..... తెలుగులో ఇప్పటికే రిలీజైన ట్రైలర్, ఆడియో జనాలకు ఇప్పటికే బాగా నచ్చడంతో సినిమాపై అంచనాలు భారీగా నెలకొన్నాయి." ప్రేమమ్" చిత్రం జెన్యూన్ రివ్యూ మీకోసం.

దర్శకత్వం : చందూ మొండేటి
నిర్మాత : సూర్యదేవర నాగవంశీ
సంగీతం : రాజేశ్ మురుగేశన్, గోపీ సుందర్
నటీనటులు : నాగ చైతన్య, శృతి హాసన్, అనుపమ పరమేశ్వరన్, మడోన్నా సెబాస్టియన్
కథ :
విక్రమ్ (నాగ చైతన్య) అనే కుర్రాడు 16 ఏళ్ల స్కూల్ వయసులో ఆకర్షణ వల్ల తన ఇంటి దగ్గరుండే సుమ(అనుపమ పరమేశ్వరన్) ను ఇష్టపడతాడు. ఆ తరువాత తన ఇంజనీరింగ్ చదివే రోజుల్లో తన లెక్చరర్ సితారా వెంకటేష్ (శృతి హాసన్) ను ప్రాణంగా ప్రేమిస్తాడు. తరువాత 30 ఏళ్ల వయసులో సింధు(మడోన్నా సెబాస్టియన్) అనే అమ్మాయి అతనికి పరిచయమవుతుంది. ఆ పరిచయం కూడా ప్రేమగా మారుతుంది.
విక్రమ్ 30 ఏళ్ల జీవితంలోని మూడు దశల్లో ఏర్పడ్డ ఆ మూడు ప్రేమ కథలు ఏమిటి ? వాటిలో ఏం జరిగింది ? వాటి వల్ల కలిగిన అనుభవాల ద్వారా విక్రమ్ లో ఎలాంటి మార్పులు వచ్చాయి. చివరికి విక్రమ్ ఎవరి ప్రేమను పొందాడు ? అన్నదే ఈ సినిమా కథ.. ఇందులో విక్రమ్ పాత్ర ద్వారా తెలిసీ తెలియని వయసులో కలిగే ఆకర్షణ, ఎవరినీ లెక్కచేయని యుక్త వయసులో కలిగే ప్రేమ, వాటి వలన కలిగే భాధ అన్నీ తెలిసాక దొరికే పరిపూర్ణమైన ప్రేమ వంటి అనుభవాలను చూపారు.
ప్లస్ పాయింట్స్ :
ఈ సినిమాకి ప్రధాన ప్లస్ పాయింట్ అంటే సూపర్ హిట్టైన ఒరిజినల్ మలయాళ వర్షెన్ కు అల్ఫోన్సే పుత్రేన్ అందించిన అందమైన ప్రేమ ‘కథ’. ఈ కథ వలనే ఈ తెలుగు రీమేక్ పై మొదటి నుండి మంచి పాజిటివ్ అంచనాలున్నాయి. పైగా దర్శకుడు చందూ మొండేటి ఒరిజినల్ వెర్షన్ ను కాపీ కొట్టకుండా కాస్త కొత్తగా ట్రై చేయడం కూడా ఈ సినిమాకి మరో ప్లస్ పాయింట్. అలాగే హీరో అక్కినేని నాగ చైతన్య నటన సినిమాని మరో మెట్టు పైకి తీసుకెళ్లింది. నటనలో చైతూ పూర్తి స్థాయి పరిపూర్ణతను కనబరిచాడు. ఇంతకు ముందు చేసిన సినిమాలతో పోలిస్తే ఇందులోనే చాలా ఇష్టంగా నటించాడన్నది ఇట్టే స్పష్టమవుతోంది.
స్కూల్ కుర్రాడిలా, రఫ్ అండ్ టఫ్ కాలేజీ కుర్రాడిగా అతని నటన చాలా బాగుంది. ముఖ్యంగా కొన్ని ఎమోషనల్, రొమాంటిక్ సన్నివేశాల్లో చైతు ఇరగదీశాడనే చెప్పాలి. ఇక మన తెలుగు ఫార్మాట్ కు తగ్గట్టు మొదటి భాగంలో హీరో స్నేహితుడి పాత్రలో ప్రవీణ్, కాలేజీ పీడీ పాత్రలో బ్రహ్మాజీ, నర్రా శ్రీనివాస్ పాత్రలతో, సెకండ్ హాఫ్ లో శ్రీనివాస్ రెడ్డి పాత్రతో పండించిన కామెడీ ఎక్కడా మిస్ ఫైర్ కాకున్నదా పర్ఫెక్ట్ గా పనిచేసి మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చింది. ఇక అక్కినేని అభిమానుల కోసమే అన్నట్టు మొదటి భాగంలో హీరో మేనమామగా వెంకటేష్ అతిధి పాత్ర, సెకండ్ హాఫ్ క్లైమాక్స్ లో వచ్చే హీరో తండ్రిగా నాగార్జున అతిధి పాత్ర, అక్కడక్కడా హుషారెత్తించే డైలాగులు బాగా కనెక్టయ్యాయి.
మైనస్ పాయింట్స్ :
ఈ చిత్రంలోని మైనస్ పాయింట్స్ అంటే చాలా మందికి అసలు కథ, అందులోని పాత్రల నడవడిక పూర్తిగా తెలిసిపోవడం. దీంతో మామూలుగానే ఈ సినిమాకి ఒరిజినల్ వెర్షన్ కి వద్దనుకున్నా కాస్త కంపారిజన్ ఏర్పడి కథనంలో, పాత్రల పర్ఫామెన్స్ లో అక్కడక్కడా కాస్త నిరుత్సాహం కలిగింది . అలాగే లెక్చరర్ పాత్రలో శృతి హాసన్ అంత గొప్పగా కుదరకపోవడంతో ఆ లవ్ ట్రాక్ లో కాస్త బలం తగ్గి కాస్త బోర్ కొట్టింది. ఇక మొదటి భాగం ఇంటర్వెల్ ముందు కాసేపు సినిమాను సాగదీశారు.
సాంకేతిక విభాగం :
ప్రేమమ్ ఒరిజినల్ వెర్షన్ కు బలం కెమెరా వర్క్, సంగీతం. ఈ రెండు కూడా ఆ సినిమా పట్ల ప్రేక్షకుడు అభిమానం పెంచుకోవడానికి చాలా బాగా ఉపయోగపడ్డాయి. అలాగే ఇక్కడ తెలుగులో కూడా ఒరిజినల్ వెర్షన్ నుండి తీసుకుని గోపి సుందర్, రాజేష్ మురగేశన్(ఒరిజినల్ వెర్షన్ కి పనిచేశాడు) అందించిన సంగీతం, కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీ చాలా బాగా కుదిరాయి.
ఇక ఒరిజినల్ కథకి దర్శకుడు చందూ మొండేటి కొత్తదనం చూపిస్తూ రాసుకున్న స్క్రీన్ ప్లే ప్రేక్షకులకి కనెక్టయ్యే విధంగా ఉంది. సినిమాకి ముఖ్యమైన విక్రమ్ పాత్ర నుండి అన్ని రకాల ఎమోషన్స్ రాబట్టుకోవడంలో చందూ సక్సెస్ అయ్యారు. అలాగే కొన్ని సన్నివేశాలలో ఆయన రాసిన డైలాగులు చాలా బాగున్నాయి. కోటగిరి వెంకటేశ్వర రావు గారి ఎడిటింగ్ కూడా సినిమా స్పష్టంగా అర్థమయ్యేలా చేసింది. ఎస్. నాగ వంశీ పాటించిన నిర్మాణ విలువలు గొప్పగా ఉన్నాయి.
తీర్పు :
ఒక్కమాటలో చెప్పాలంటే ఈ చిత్రం నటుడిగా నాగ చైతన్య స్థాయిని పెంచే చిత్రం. ఆయన నటన సినిమాకి ప్రధాన ఆకర్షణ నిలుస్తుంది. అలాగే చందూ మొండేటి ఆకట్టుకునే స్క్రీన్ ప్లే, పర్ఫెక్ట్ టైమింగ్ తో సాగే కామెడీ, థ్రిల్లింగా అనిపించే వెంకటేష్, నాగార్జునల ముఖ్యమైన అతిధి పాత్రలు, ఫస్టాఫ్, సెకండాఫ్ లో వచ్చే కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు, హీరో పాత్ర చిత్రీకరణ, వినసొంపైన సంగీతం ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ కాగా కథలోని రెండవ ప్రేమ కథలోని కొన్ని బోరింగ్ సన్నివేశాలు నిర్లక్ష్యం వహించవలసిన మైనస్ పాయింట్స్. మొత్తానికి ఒరిజినల్ వెర్షన్ తో పోలిక పెట్టుకోకుండా కొత్త సినిమా చూస్తున్నట్టు చూస్తే ఈ సినిమా ఖచ్చితంగా అందరికీ నచ్చుతుంది.
ఓవరాల్ మూవీ రేటింగ్:3.6/5

ప్రకాష్ రాజ్ "మన ఊరి రామాయణం" చిత్రం విడుదల అయింది ఈ చిత్రం రివ్యూ మీ కోసం!!

తన విలక్షణ నటనతో ఎలాంటి పాత్రనైనా రక్తికట్టించగల నటుడు ప్రకాశ్ రాజ్, నిర్మాతగా, దర్శకుడిగానూ అద్భుతమైన ఖ్యాతి గడించిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన ‘మన ఊరి రామాయణం’ అన్న సినిమా కొద్దిరోజులుగా మంచి ఆసక్తి కలిగిస్తూ వచ్చింది. ప్రకాష్ రాజ్‌తో పాటుగా ప్రియమణి, సత్యదేవ్ ఇతర కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ మన ఊరి రామాయణం ఎలా ఉందో ఒక సారి చూసేద్దాం !!
దర్శకత్వం : ప్రకాష్ రాజ్

నిర్మాత : ప్రకాష్ రాజ్
సంగీతం : ఇళయరాజా
నటీనటులు : ప్రకాష్ రాజ్, ప్రియమణి, సత్య దేవ్, పృథ్వీ..

కథ :
భుజంగయ్య (ప్రకాష్ రాజ్).. ఊర్లో పేరూ, పలుకుబడి ఉన్న ఓ పెద్ద మనిషి. తన కుటుంబంతో పాటు సమాజంలోనూ మంచి వ్యక్తిగా, పరువు ప్రతిష్టలతో జీవితం గడపాలన్నదే భుజంగయ్య కోరిక. అలాంటి మనిషి కుటుంబంతో చిన్న గొడవ పడి, ఆ కోపంలో ఒకరోజు ఓ వేశ్య (ప్రియమణి)తో సరదాగా గడపాలనుకుంటాడు. అయితే కొన్ని అనుకోని పరిస్థితుల్లో భుజంగయ్య తన ఇంటిని ఆనుకొనే ఉండే ఓ చిన్న కొట్టులో ప్రియమణితో పాటు చిక్కుకుపోతాడు. ఆ తర్వాత తన పరువు పోకుండా, ఎవ్వరికీ ఈ విషయం తెలియకుండా భుజంగయ్య ఎలా బయటపడ్డాడు? ఈ మొత్తం తతంగంలో ఆయనలో వచ్చిన మార్పేంటీ అన్నదే సినిమా.
ప్లస్ పాయింట్స్ :
ప్రకాష్ రాజ్ నటనను, ఆయన ఎంచుకున్న కథను ఈ సినిమాకు ప్రధాన బలంగా చెప్పుకోవాలి. ప్రపంచం దృష్టిలో రాముడిలా, మంచి వాడిలా కనబడే వ్యక్తికే రావణాసురిడి తరహాలో తప్పుడు ఆలోచనలు వస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనను కథగా మలిచిన విధానం చాలా బాగుంది. ఆ కథను సినిమాగా మలచడంలో కూడా ప్రకాష్ రాజ్ చూపిన ప్రతిభను మెచ్చుకోవచ్చు. ముఖ్యంగా కథలోని ఎమోషన్ కట్టిపడేసేలా ఉంది. ఆ ఎమోషన్‌ను కూడా ఎక్కడా స్థాయి మించనివ్వకుండా చూడడం ఇంకా బాగా ఆకట్టుకుంది. ఇక కథానుసారంగా వచ్చే జెన్యూన్ ఫన్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రకాష్ రాజ్ రైటింగ్‌లోని ప్రతిభంతా కథ నుంచే పుట్టించిన ఫన్‌లో చూడొచ్చు.
భుజంగయ్య పాత్రలో ప్రకాష్ రాజ్ నటనలో తన స్థాయిని మరోసారి చాటిచెప్పారు. చిన్న చిన్న ఎమోషన్స్‌ను పలికించడంలో ఆయన చూపిన నేర్పు గురించి ఎంత చెప్పినా తక్కువే. క్లైమాక్స్ సన్నివేశాల్లో అయితే ఆయన నటన అద్భుతమనే చెప్పాలి. ప్రియమణి తన పాత్రలో ఒదిగిపోయి నటించేసింది. ఎండ్‌కార్డ్ పడే సమయంలో ప్రియమణి నటన సింప్లీ సూపర్బ్ అనాల్సిందే. సత్యదేవ్ ప్రకాష్ రా‌జ్‌కు నమ్మిన భంటుగా చాలా బాగా చేశాడు. కామెడీ పాత్రలతోనే ఎక్కువగా మెప్పిస్తూ ఉండే పృథ్వీ ఇందులో ఓ బలమైన సీరియస్‌నెస్ ఉన్న పాత్రలో నటించి కట్టిపడేశాడు.
మైనస్ పాయింట్స్ :
ఫస్టాఫ్‌లో కొన్నిచోట్ల కథా వేగం తగ్గి బోర్ కొట్టించడం మైనస్‌గా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కొన్నిచోట్ల అనవసరమైన సన్నివేశాలతో కథలోకి వెళ్ళకుండా పక్కదార్లు పట్టినట్లు అనిపించింది. ఇక రెగ్యులర్ కమర్షియల్ అంశాల జోలికి అస్సలు పోకుండా ఉన్న ఈ సినిమా అలాంటి అంశాలే కోరేవారికి నచ్చకపోవచ్చు.
సాంకేతిక విభాగం :
ముందుగా దర్శకుడు ప్రకాష్ రాజ్ గురించి చెప్పుకుంటే, నటనపరంగానే కాక దర్శకుడిగానూ తనది ప్రత్యేక శైలి అని మరోసారి నిరూపించుకున్నారు. ఒక సింపుల్ పాయింట్ నుంచి కథ అల్లి, దానికి మంచి ఎంగేజింగ్ స్క్రీన్‌ప్లే రాసుకొని రచయితగా ప్రకాష్ రాజ్ బాగా ఆకట్టుకున్నారు. ఒక చిన్న ప్రపంచం చుట్టూనే తిరిగే అలాంటి కథను సినిమాగా తెరకెక్కించడంలోనూ మేకింగ్ పరంగా ప్రకాష్ రాజ్ చాలాచోట్ల మెరిశారు. ఫస్టాఫ్‌లో అసలు కథలోకి తీసుకెళ్ళకుండా కాస్త నెమ్మదిగా సినిమాను నడిపించడంలో మాత్రం ప్రకాష్ కాస్త తడబడ్డట్టు అనిపించింది.
ఇళయరాజా బ్యాంక్‍గ్రౌండ్ స్కోర్ గురించి ఎంత చెప్పినా తక్కువే. కథలోని అసలైన ఎమోషన్ స్థాయిని పెంచేలా ఇళయరాజా అందించిన స్కోర్ చాలా బాగుంది. ఇక ముకేశ్ సినిమాటోగ్రఫీ న్యాచురల్‌గా బాగుంది. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్, శశిధర్ ఆర్ట్ వర్క్ బాగున్నాయి. ప్రొడక్షన్ వ్యాల్యూస్ సినిమా అవసరానికి తగ్గట్టు బాగున్నాయి.
తీర్పు :
ఒక సాధారణ మనిషివి చాలాసార్లు చిన్న చిన్న ఆలోచనా విధానాలూ, ప్రపంచాలే! తన చుట్టూ ఉండేవాళ్ళు తనను గౌరవించాలీ, సమాజంలో పరువు, ప్రతిష్టలతో బతకాలి అని కోరుకునే ఓ పెద్దమనిషి, ఒకానొక రోజు మత్తులో చేసే కొన్ని తప్పులు ఆయనను ఎటువైపు తీసుకెళ్ళాయన్న బలమైన ఎమోషన్‌తో ఓ సినిమా చేయాలన్న ప్రయత్నమే మన ఊరి రామాయణంకి ప్రధాన బలం. నటీనటులంతా తమ స్థాయికి తగ్గట్టుగా నటించడం, కథ నుంచే వచ్చిన జెన్యూన్ కామెడీ, ఎమోషన్ లాంటి అనుకూల అంశాలతో వచ్చిన ఈ సినిమాలో రెగ్యులర్ కమర్షియల్ అంశాలు లేకపోవడమే మైనస్. ఒక్క మాటలో చెప్పాలంటే.. ‘మన ఊరి రామాయణం’ రాముడిలా కనిపించే మనిషిలోని రావణాసురుడిని బయటకు తీసుకొచ్చి చూపే సినిమా.
ఓవర్ఆల్ రేటింగ్:3.5/5



Thursday, 6 October 2016

హీరో నిఖిల్ గౌడ "జాగ్వార్" సినిమా ఈ రోజు విడుదల అయింది , జెన్యూన్ రివ్యూ మీకోసం !!




మాజీ ప్రధానమంత్రి అయినటువంటి"  హెచ్ డి దేవగౌడ " గారి మనవడు "నిఖిల్" ఈ "జాగ్వార్" సినిమా ద్వార హీరో గా పరిచయం అవుతునటువంటి విషయం తెలిసిందే. తెలుగు, కన్నడ భాషల్లో సుమారు 75 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన సినిమా ఇది . తమన్నా ఈ సినిమా లో స్పెషల్ సాంగ్ చేసింది.భారీ అంచనాల మధ్య ఈ రోజు విడుదల అయిన ఈ చిత్రం రివ్యూ మీకోసం !!
దర్శకత్వం : ఏ. మహదేవ్
నిర్మాత : అనితా కుమారస్వామి
సంగీతం : ఎస్.ఎస్.థమన్
నటీనటులు : నిఖిల్ కుమార్, దీప్తి సతి, జగపతి బాబు, రావు రమేష్..

కథ :
ఎస్.ఎస్.కృష్ణ (నిఖిల్ కుమార్) మెడిసిన్ చదివే ఓ కుర్రాడు. తన చుట్టూ ఉండే అందరిలానే చదువుకుంటూ, సరదాగా కాలం వెళ్ళదీసే కృష్ణ, రాత్రి వేళల్లో ఓ టీవీ ఛాన‌ల్‍నే హ్యాక్ చేసి, మాస్క్ వేసుకొని పలు హత్యలు చేస్తూ అవి లైవ్‌లో వచ్చేలా చేస్తూంటాడు. ఈ లైవ్ హత్యలను సీరియస్‌గా తీసుకున్న ప్రభుత్వం ఆ కేసును డీల్ చేయడానికి ఓ సీబీఐ ఆఫీసర్‌ (జగపతి బాబు)ను కూడా నియమిస్తుంది. కృష్ణ ఇలా హత్యలు చేయడానికి గల కారణం ఏంటి? ఆ హత్యలన్నింటినీ లైవ్‌లో ఎందుకు ప్రదర్శిస్తూంటాడు? ఈ కథలో రామ చంద్రయ్య (రావు రమేష్), ప్రియ (దీప్తి సతి), సుప్రీత్, సంపత్ ఎవరు? అన్న ప్రశ్నలకు సమాధానమే సినిమా.
ప్లస్ పాయింట్స్ :
ముందుగా సినిమాకు ఎంచుకున్న ప్రధాన కథ బాగుంది. ఆ కథలో ఉన్న ఎమోషన్ కూడా బలమైనది కావడం సినిమాకు ఒక అర్థాన్ని తెచ్చింది. రావు రమేష్ ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ సినిమాకి హైలైట్‌గా చెప్పాలి. ముఖ్యంగా ఈ ఎపిసోడ్‌లో రమేష్ తన సహజమైన నటనతో బాగా ఆకట్టుకున్నాడు. ఇంటర్వెల్ ట్విస్ట్, క్లైమాక్స్ కూడా బాగున్నాయి. ఇక మొదటి పది నిమిషాల ఛేజింగ్ ఎపిసోడ్, మధ్యలో కార్ ఎపిసోడ్ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు బాగున్నాయి.
నిఖిల్ గౌడ డ్యాన్సుల్లో, యాక్షన్ ఎపిసోడ్స్‌లో బాగా ఆకట్టుకున్నాడు. యాక్టింగ్ విషయంలో మాత్రం ఇంకా పరిణతి చెందాల్సి ఉంది. జగపతి ఓ స్టైలిష్ సీబీఐ ఆఫీసర్‌గా బాగా చేశాడు. ముఖ్యంగా ఆయన పాత్రను పరిచయం చేసిన విధానం బాగుంది. ముందే చెప్పినట్లు రావు రమేష్ తన పాత్రలో ఒదిగిపోయి నటించేశాడు. రమ్యకృష్ణ క్లైమాక్స్‌లో ఇచ్చిన అప్పీయరన్స్ ఆ సన్నివేశాలకు బలాన్నిచ్చింది. ఆదర్శ్ ఒక పూర్తి స్థాయి పాజిటివ్‌ రోల్‍లో చాలా బాగా చేశాడు.
మైనస్ పాయింట్స్ :
అసలు కథను పక్కనబెడితే ఈ స్క్రీన్‌ప్లే ఫార్మాట్ తెలుగులో ఇప్పటికే ఎన్నో సినిమాల్లో చూసి ఉంటాం. అదే ఫార్మాట్‌లో వచ్చే పాటలు, లవ్‌ట్రాక్ సాగదీసి బోర్ కొట్టించాయి. సెకండాఫ్‌లో అనవసరంగా ఇరికించిన కామెడీ కూడా పెద్దగా ఆకట్టుకోలేదు. హీరో, హీరోయిన్ల లవ్‌ట్రాక్ కూడా సిల్లీగానే అనిపించింది. ఇక లాజిక్ అన్నది పెద్దగా పట్టించుకోకపోవడమే మంచిది. హీరో అనుకున్నవి అనుకున్నట్లు జరిగిపోయే సన్నివేశాలు, గేంప్లాన్స్ అన్నీ ఓవర్ అనిపించేలా ఉన్నాయి. అసలు కథలోని ఎమోషన్‌ను బలంగా చెప్పే సన్నివేశాలను మినహాయిస్తే మిగతా సినిమా అంతా అర్థం లేని సన్నివేశాలతో నడుస్తూ విసుగు పుట్టించింది. విలన్ పాత్ర కూడా పవర్‍ఫుల్‌గా లేకపోవడం మైనస్ పాయింటే!
సాంకేతిక విభాగం :
ముందుగా దర్శకుడు మహదేవ్ విషయానికి వస్తే, విజయేంద్ర ప్రసాద్ అందించిన కథకు మహదేవ్ అల్లిన స్క్రీన్‍ప్లే సాదాసీదాగా ఉంది. కథకు అనవసరమైన ఎపిసోడ్స్‌ను జతచేస్తూ పోయి మంచి కమర్షియల్ సినిమా కాగల కథను అలా వదిలేశారు. మేకింగ్ పరంగానూ మహదేవ్ చూపిన ప్రతిభ పెద్దగా ఏమీ కనిపించలేదు.
సినిమాటోగ్రఫీ ఈ సినిమాకు టెక్నికల్‌గా బిగ్గెస్ట్ ప్లస్. విజువల్స్ అన్నీ రిచ్‌గా కనిపించేలా, లొకేషన్స్‌ను సరిగ్గా వాడుకుంటూ, లైటింగ్, ఫ్రేమింగ్‌తో మనోజ్ పరమహంస ప్రతిచోటా ఆకట్టుకున్నారు. ఎస్.ఎస్.థమన్ అందించిన పాటలు చెప్పుకోదగ్గ స్థాయిలో లేకపోయినా ఆయన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మాత్రం చాలా బాగుంది. రూబెన్ ఎడిటింగ్ బాగానే ఉంది. యాక్షన్ డైరెక్టర్స్ పనితనాన్ని కచ్చితంగా అభినందించాల్సిందే. ఫస్టాఫ్ ఛేజ్, సెకండాఫ్‌లో కార్ ఛేజ్ బాగా డిజైన్ చేశారు. ప్రొడక్షన్ వ్యాల్యూస్‌కు ఎక్కడా కాస్త కూడా వంక పెట్టడానికి లేదు.
తీర్పు :
జాగ్వార్.. తెలుగు కమర్షియల్ సినిమాల పరంపరలో ఎప్పుడూ వస్తూ పోతూండే వాటిల్లో ఒక సినిమా. అయితే ఈ సినిమాలో స్టార్ హీరో లేకపోవడమన్నదే కొత్తది. అసలు కథలోని ఎమోషన్ బాగుండడం, కొన్ని ఛేజింగ్ సన్నివేశాలు బాగా ఆకట్టుకోవడం లాంటి ప్లస్‌లతో వచ్చిన ఈ సినిమా మిగతా అన్నిచోట్లా రొటీన్ అయిపోవడం నిరాశపరిచే అంశం. ఒక్కమాటలో చెప్పాలంటే.. రొటీన్ కమర్షియల్ అంశాలతో, జస్ట్ ఓకే అనిపించే స్పీడ్‌తో  వచ్చిన ‘జాగ్వార్’ ఇది..!!
ఓవర్ఆల్ రేటింగ్ :3.0/5