Friday, 9 December 2016

ధృవ మూవీ రివ్యూ రేటింగ్ మిరే చూసేయండి !!

నటీనటులు: రామ్‌చరణ్‌.. రకుల్‌ప్రీత్‌ సింగ్‌.. అరవిందస్వామి.. పోసాని కృష్ణమురళి.. నాజర్‌.. నవదీప్‌ తదితరులు 
                                         సంగీతం: హిప్‌ హాప్‌ తమిళ 
                                               కళ: నాగేంద్ర 
                                     ఛాయాగ్రహణం: పి.ఎస్‌.వినోద్‌ 
                                           కూర్పు: నవీన్‌ నూలి 
                              నిర్మాతలు: అల్లు అరవింద్‌, ఎన్‌.వి. ప్రసాద్‌ 
                                             దర్శకత్వం: సురేందర్‌రెడ్డి 
                                                  విడుదల తేదీ: 9-12-2016

తమిళంలో విజయవంతమైన చిత్రాలు అనువాదాలుగా తెలుగులోనూ విడుదలవుతుంటాయి. అయితే ‘తని ఒరువన్‌’ కథలో మాత్రం తాము నటించాల్సిందే అంటూ పలువురు కథానాయకులు ఆసక్తి చూపించారు. ఆ కథ మన పరిశ్రమని అంతగా ఆకర్షించింది. అందులో నటించే అవకాశం మాత్రం రామ్‌చరణ్‌కే లభించింది. తమిళంలో వంద కోట్లకిపైగా వసూళ్లు సాధించిన ‘తని ఒరువన్‌’ రీమేక్‌లో రామ్‌చరణ్‌ నటించడం, అది కూడా ‘మగధీర’ తర్వాత గీతాఆర్ట్స్‌లో ఈ సినిమా చేస్తుండటంతో ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగాయి. దానికితోడు ప్రచార చిత్రాలూ ఆకట్టుకొనేలా ఉండటంతో సినిమాపై ఆసక్తిని పెంచింది. మరి ఆ ఆసక్తికి తగ్గట్టుగానే సినిమా సాగుతుందో లేదో తెలుసుకొందాం పదండి.
కథేంటంటే?:
 ధృవ (రామ్‌చరణ్‌)కి చిన్నప్పట్నుంచీ దేన్నైనా లోతుగా పరిశీలించడం ఓ అలవాటు. ఆ అలవాటుతోనే చిన్న చిన్న నేరాలన్నింటి వెనుక వ్యవస్థీకృత నేరం ఒకటి ఉంటుందని గ్రహిస్తాడు. తాను ఐపీఎస్‌కు ఎంపికయ్యాక శిక్షణలో ఉండగానే ఆ నేరాలపై పరిశోధన చేయడం మొదలుపెడతాడు. శిక్షణలో ఉన్నప్పుడే ధృవ, అతని బృందం బయట జరిగే చిన్న చిన్న నేరాల అంతు చూస్తుంటారు. ‘ఎవడిని కొడితే వందమంది క్రిమినల్స్‌ అంతం అవుతారో వాడినే అంతం చేయాలనే’ లక్ష్యం పెట్టుకొన్న ధృవ ఐపీఎస్‌ శిక్షణ పూర్తయ్యే క్రమంలోనే ఓ బలమైన శత్రువుని ఎంచుకొంటాడు. ఆ శత్రువే సిద్ధార్థ్‌ అభిమన్యు (అరవింద్‌ స్వామి). ఒక శాస్త్రవేత్త అయిన సిద్ధార్థ్‌ ఎన్నో అక్రమాలకి పాల్పడుతుంటాడు. ఇండియాకి జనరిక్‌ మందులు వచ్చే విషయంలో అడ్డు పడుతుంటాడు. మరి ఎంతో బలవంతుడైన సిద్ధార్థ్‌ అభిమన్యుని ధృవ ఎలా ఎదిరించాడు? అతని వెనుక ఉన్న వందమంది క్రిమినల్స్‌ ఆట ఎలా కట్టించాడు? ఈ కథలో ఇషిక(రకుల్‌ప్రీత్‌ సింగ్‌) ఎవరు? తదితర విషయాల్ని తెరపై చూడాల్సిందే.
ఎలా ఉందంటే?: 
ఇందులో కథ కంటే కథనానిదే పెద్దపీట. ‘నీ శత్రువుని చూసి నీ కెపాసిటీ ఏంటో అంచనా వేయొచ్చు’ అనే సూత్రాన్ని నమ్మిన ఓ యువ ఐపీఎస్‌ అధికారి, బలమైన శత్రువుని ఎంచుకొని అతని ఆట కట్టించడమే ఈ సినిమా కథ. బలమైన శత్రువుని ఎదుర్కొనే క్రమమే ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఒక సాదాసీదా కథకి, శక్తిమంతమైన కథనాన్ని జోడించారు. దీంతో ప్రతి సన్నివేశం ఎత్తులు పైఎత్తులతో సాగుతుంది. తొలి సగభాగం సినిమా కథానాయకుడు తన శత్రువుని ఎంచుకొని, అతని డెన్‌లోకి అడుగుపెట్టే సన్నివేశాలతో తీర్చిదిద్దారు. మలి సగభాగం కథంతా శత్రువుకి, కథానాయకుడికి మధ్య మైండ్‌గేమ్‌తో సాగుతుంది. రీమేక్‌ సినిమా తీస్తున్నప్పుడు కథలో ఫీల్‌ మిస్‌ కాకుండా చూసుకోవడం అన్నిటికంటే ముఖ్యం. కానీ ఈ సినిమాలో కొన్ని చోట్ల అది మిస్సయినట్లు కనిపిస్తుంది. అరవింద్‌ స్వామి పాత్ర ప్రవేశించాక సినిమా వేగం పుంజుకొంటుంది. తమిళంలో ప్రేక్షకాదరణ పొందిన చిత్రం కాబట్టి దాన్ని చెడగొట్టకూడదనో, మరేంటో తెలియదు కానీ... ఎక్కువ సన్నివేశాలు ‘తని ఒరువన్‌’లో ఉన్నట్టుగానే తీర్చిదిద్దారు దర్శకుడు. అయితే ‘అష్టదిగ్బంధనం’ కాన్సెప్ట్‌ను బాగా ప్లాన్‌ చేశారు. సినిమా మాత్రం మంచి యాక్షన్‌ థ్రిల్లర్‌ని చూసిన అనుభూతికి గురిచేస్తుంది.
ఎవరెలా చేశారంటే?: 
రామ్‌చరణ్‌ యువ ఐపీఎస్‌ అధికారి ‘ధృవ’ పాత్రలో స్టైలిష్‌గా కనిపిస్తూనే ఆ పాత్రలో ఒదిగిపోయాడు. రకుల్‌ప్రీత్‌ సింగ్‌ అందంగా కనిపించింది తప్ప నటించడానికి మాత్రం పెద్దగా ప్రాధాన్యం లభించలేదు. పరేషానురా... పాటలో ఆమె అందచందాలు కుర్రకారుకి కిక్కెక్కించేలా ఉంటాయి. అరవింద్‌స్వామి పాత్ర సినిమాకి కీలకం. ఆయన స్టైలిష్‌ విలన్‌గా చక్కగా నటించారు. ద్వితీయార్ధంలో ఆయనపైనే ఎక్కువ సన్నివేశాలు ఉంటాయి. అరవింద్‌ స్వామి తండ్రిగా పోసాని కనిపిస్తారు. రామ్‌చరణ్‌ స్నేహితుల్లో ఒకరిగా నవదీప్‌ కనిపిస్తారు. తన పాత్ర పరిధి మేరకు బాగానే నటించాడు నవదీప్‌. సాంకేతికంగా ఈ సినిమాకి మంచి మార్కులే పడతాయి. సురేందర్‌రెడ్డి సాంకేతికంగా సినిమాని తనదైన శైలి స్టైలిష్‌ మేకింగ్‌తో తీర్చిదిద్దారు. పి.ఎస్‌.వినోద్‌ ఛాయాగ్రహణం, హిప్‌ హాప్‌ తమిళ సంగీతం బాగుంది. నిర్మాణ విలువలు అడుగడుగునా కనిపిస్తాయి.
బలాలు 
+నటీనటులు
+రామ్‌చరణ్‌లుక్‌
+కథనం
+సంగీతం
+ ఛాయాగ్రహణం
బలహీనతలు 
-అక్కడక్కడ సన్నివేశాల్లో సాగతీత
చివరిగా: ఓ మాస్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌... ధృవ 

రేటింగ్ : 4/5





No comments:

Post a Comment